AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన

Rain

Rain

AP and Telangana Weather: ఆంధ్రప్రదేశ్, తెలంగాణపై ఉపరితల ద్రోణులు, ఆవర్తనాల ప్రభావం కొనసాగుతోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 3.1 నుంచి 4.5 కిలోమీటర్ల ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్‌పై మరో ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నట్లు వాతావరణ పరిస్థితులు సూచిస్తున్నాయి. అదేవిధంగా ఉత్తర-దక్షిణ ద్రోణి దక్షిణ తెలంగాణ నుంచి రాయలసీమ మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు విస్తరించి ఉంది. ఈ వాతావరణ వ్యవస్థల ప్రభావంతో ఏపీలో ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో బలమైన గాలులు వీచే అవకాశం ఉండగా, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో, గరిష్ఠంగా 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చని అంచనా.

మరోవైపు పగటి సమయంలో ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతోంది. అయితే అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. అక్కడ రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. ఏజెన్సీ వ్యాప్తంగా 18 నుంచి 20 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతంలో పొగమంచు తీవ్రత కూడా పెరిగింది. దీంతో వాహనదారులు అప్రమత్తంగా ప్రయాణిస్తున్నారు. పొగమంచు కారణంగా వాహనాల రాకపోకలు హెడ్లైట్ల వెలుతురులోనే కొనసాగుతున్నాయి. దృశ్యమానత తగ్గడంతో డ్రైవర్లు జాగ్రత్తగా ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవల కురిసిన వర్షాల ప్రభావంతో అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. చల్లటి వాతావరణం, పొగమంచు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా వంజంగి, మేఘాలకొండ ప్రాంతాలకు పర్యాటకుల తాకిడి పెరుగుతోంది. దీంతో ఏజెన్సీ ప్రాంతం ప్రస్తుతం చల్లటి వాతావరణంతో పాటు పర్యాటక సందడితో కనిపిస్తోంది.