Heavy Rains Expected in AP: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల సంస్థ తెలిపింది. ఆగ్నేయ, దానికి ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతంలో శుక్రవారం అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇది ఎల్లుండికి బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని, ఆ తర్వాత మూడు రోజుల్లో మరింత బలపడి కోస్తాంధ్ర తీరం వైపు వచ్చే సూచనలు ఉన్నాయని వెల్లడించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వర్షాలు విస్తృతంగా కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
తమిళనాడు, కేరళ ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడన ప్రభావంతో నేడు రాయలసీమలో చెదురుమదురుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ తెలిపింది. రేపు, ఎల్లుండి అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ప్రజలు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. సోమవారం నుంచి రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడటంతో పాటు అక్కడక్కడ భారీ వర్షాలు కూడా కురిసే సూచనలు ఉన్నాయని వెల్లడించారు. బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం, తదుపరి వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్ర ప్రాంతంలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
వర్షాలతో పాటు సముద్ర తీర ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల సంస్థ హెచ్చరించింది. తీరం వెంబడి గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే సూచనలు ఉన్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, వాతావరణ పరిస్థితులను నిరంతరం గమనించాలని సూచించింది. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే తీరానికి తిరిగి రావాలని సూచించింది. బలమైన గాలులు, సముద్ర పరిస్థితుల నేపథ్యంలో చేపల వేటకు వెళ్లడం ప్రమాదకరమని హెచ్చరించింది. ప్రజలు, ముఖ్యంగా తీర ప్రాంతాల్లో నివసించే వారు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు సూచించే జాగ్రత్తలను పాటించాలని కోరింది.

