AP 10th Results: వాహ్!! మీరు సూపర్.. ఒకేసారి పదో తరగతి పాసైన తల్లి కొడుకులు..

Ap Mother Son Pass

Ap Mother Son Pass

AP 10th Results: అన్న తమ్ముడు, అక్కా చెల్లెలు, అక్క తమ్ముడు, చెల్లెలు అన్న ఇలా ఇద్దరూ ఒకేసారి టెన్త్ పాసైన సంఘటనలు మీరు చూసే ఉంటారు. కానీ.. ఏపీలో మాత్రం అబ్బుర పరిచే ఘటన జరిగింది. తాజాగా విడుదలైన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో తల్లి కొడుకులు అదరగొట్టారు. చదువుకోవాలని కోరిక ఉన్నప్పటికీ పరిస్థితులు అనుకూలించక ఆరవ తరగతిలోనే స్కూలుకి దూరమైన ఓ తల్లి పదో తరగతి పరీక్షలు రాసి కొడుకుతోపాటు ఉత్తీర్ణత సాధించింది. చదువుకోవడానికి వయసుతో సంబంధం లేదని ఆ తల్లి నిరూపించింది. విద్యకు వివాహం పిల్లలు వయసు అడ్డు కాదని తన కొడుకుతో కలిసి ఓ మహిళ పదవ తరగతి పరీక్ష రాసి రుజువు చేసింది ఆ తల్లి.

పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలం పూలపల్లికి చెందిన బండారు లక్ష్మి లహరి అలియాస్ అశ్విని ఆరవ తరగతిలోనే చదువును ఆపేసింది. వెంటనే పెళ్లి అవటంతో చదువుకోవాలనే తన కోరిక అలాగే మిగిలిపోయింది. పరిస్థితులు అనుకూలించక చదువు పూర్తి చేయలేకపోయింది కానీ.. చదవాలన్న పట్టుదల ఏ మాత్రం తగ్గలేదు. ఇక ఇటీవల జరిగిన పదవ తరగతి పరీక్షల్లో తన పెద్ద కుమారుడు విజయ్‌తో పాటు తాను ప్రైవేటుగా పది పరీక్ష రాసింది. రెగ్యులర్‌గా పరీక్షకు హాజరైన కొడుకు విజయ్‌ 600 గాను 562 మార్కులు రాగా.. ప్రైవేటుగా పరీక్ష రాసిన తల్లి అశ్వినికి 500 గాను 360 మార్కులు వచ్చాయి. ఇలా తల్లి కొడుకు ఒకేసారి పదవ తరగతి విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడంతో పలువురు అభినందిస్తున్నారు. చదువు కోవాలన్న కోరిక ఉంటే.. ఎప్పుడైనా చదువచ్చు. వయసు, పరిస్థితులు అడ్డురావని అశ్విని నిరూపించింది.