Site icon NTV Telugu

New Sports Policy: క్రీడా రంగంలో కొత్త పాలసీ.. ప్రతిభ చాటినవారికి ఉద్యోగాలు ఇవ్వడం రద్దు..!

Rk Roja

Rk Roja

New Sports Policy: క్రీడా రంగంలో కొత్త పాలసీ తీసుకొస్తున్నాం అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్‌ మంత్రి ఆర్కే రోజా.. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆమె.. క్రీడా రంగంలో కొత్త పాలసీ తెస్తాం.. ఇకపై అత్యున్నత ప్రతిభ చాటిన క్రీడాకారులకు ఉన్నత ఉద్యోగాలు ఇవ్వడం రద్దు చేస్తాం అన్నారు.. అయితే, వివిధ రకాలుగా వారికి ప్రోత్సాహాకాలు ఉంటాయి.. కానీ, ఇకపై గ్రూప్ 1 స్థాయి ఉద్యోగాలు ఇవ్వడం జరగదు స్పష్టం చేశారు.. ఏపీలో కనీవిని ఎరుగని రీతిలో క్రీడా సంబరాలు నిర్వహించనున్నట్టు తెలిపారు మంత్రి రోజా.. గాంధీ జయంతి పురస్కరించుకొని అక్టోబర్ 2న ఈ క్రీడా సంబరాలు ప్రారంభిస్తామన్న ఆమె.. ‘ఆడుదాం ఆంధ్రా’ పేరిట క్రీడలు ఉంటాయన్నారు.. క్రికెట్, కబడ్డీ, బ్యాడ్మింటన్, కోకో, వాలీ బాల్ మొత్తం ఐదు క్రీడల్లో పోటీలు నిర్వహిస్తామని.. మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు దశల వారీగా పోటీలు జరుగుతాయన్నారు. 58.94 కోట్ల రూపాయలతో ఈ క్రీడా పోటీలు జరగనున్నాయి.. 46 రోజుల పాటు ఈ పోటీలు నిర్వహిస్తాం అని ప్రకటించారు మంత్రి ఆర్కే రోజా..

Read Also: Supreme Court: సుప్రీంకు తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ తో పాటు ఏపీ న్యాయమూర్తి పేరు రెకమెండ్

మరోవైపు.. పవన్ కల్యాణ్, చంద్రబాబు, లోకేష్‌ను టార్గెట్ చేస్తూ నిప్పులు చెరిగారు మంత్రి రోజా. పవన్ కల్యాణ్ మళ్లీ ఎమ్మెల్యే కూడా కాలేరన్న ఆమె.. గోదావరి జిల్లాల్లో 34 నియోజకవర్గాలు గెలవడం కాదు.. దమ్ముంటే రాష్ట్రం మొత్తంలో 34మంది అభ్యర్ధులను సొంతంగా పవన్ కల్యాణ్‌ నిలబెట్టాలని ఛాలెంజ్‌ చేశారు.. లోకేష్‌, పవన్ కల్యాణ్‌.. మొదట ఎమ్మెల్యేలుగా గెలవాలన్న ఆమె.. సొంత జిల్లాకు చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి చేసిందేమీ లేదని దుయ్యబట్టారు.. మరోవైపు.. ఓ మహిళకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం అప్పగించడం శుభపరిణామం.. అంటూ ఏపీ బీజేపీ చీఫ్‌గా నియమితులైన పురంధేశ్వరికి శుభాకంక్షలు తెలిపారు.. ఇక,తన నాన్న స్థాపించిన పార్టీ పగ్గాలు చేపట్టలేకపోయినా చివరకు బీజేపీ పగ్గాలు ఆమె అందుకుంటోందని వ్యాఖ్యానించారు మంత్రి ఆర్కే రోజా.

Exit mobile version