NTV Telugu Site icon

Bopparaju Venkateswarlu: ఉద్యమం కొనసాగింపా..? ముగింపా..? రేపే నిర్ణయం..

Bopparaju Venkateswarlu

Bopparaju Venkateswarlu

Bopparaju Venkateswarlu: మా ఉద్యమ ఫలితంగా ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అయ్యాయి.. ఇక, మా ఉద్యమాన్ని కొనసాగించాలా..? విరమించాలా..? అనే అంశంపై రేపు నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు.. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఉద్యమ ఫలితంగా ఈ నిర్ణయాలు రాలేదంటూ ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడడం సరికాదన్నారు. చంద్రశేఖర్ రెడ్డి నిన్నటి వరకు ఉద్యోగ సంఘ నేతగా ఉన్నారు.. ఇప్పుడు ప్రభుత్వానికో.. ఓ ఉద్యోగ సంఘానికో వత్తాసు పలికేలా చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడడం మంచిది కాదని హితవుపలికారు.. మిగిలిన కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరించాలని కోరుతున్నాం.. సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ విధానం అమలు చేస్తారని భావిస్తున్నాం అన్నారు బొప్పరాజు.

మా ఉద్యమ ఫలితం వల్లే ఉద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు బొప్పరాజు.. కానీ, జీపీఎస్ విధానం విధి విధానాలు చెప్పలేదన్నారు.. గతంలో 28 శాతం పెన్షన్ ఇస్తామన్నారు.. ఇప్పుడు 50 శాతం పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించారు. ఓపీఎస్ తరహాలోనే ఉద్యోగి చివరి జీతంలో 50 శాతాన్ని ఫించనుగా ఇస్తున్నారు. ఓపీఎస్ తరహాలోనే ఏడాదికి రెండు సార్లు డీఆర్ ఇస్తామన్నారు. కానీ, ఉద్యోగులు కోరుకునేది జీపీఎస్ కాదు.. ఓపీఎస్ అని పేర్కొన్నారు.. బిల్లు పెట్టే నాటికి పాత పెన్షన్ విధానాన్ని ఆమోదిస్తారని భావిస్తున్నాం అన్నారు ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు.

కాగా, ఈ రోజు జరిగిన ఏపీ కేబినెట్‌ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల కోసం ఏపీ ప్రభుత్వం కొత్త పింఛన్ విధానం తీసుకొచ్చేందుకు ఆమోదం తెలిపింది.. ఏపీ గ్యారెంటెడ్‌ పెన్షన్‌ స్కీం అమలుకు ఆమోదం తెలిపింది. సీపీఎస్ స్థానంలో జీపీఎస్ గ్యారెంటీ పెన్షన్ స్కీం బిల్లు ముసాయిదాను ఇవాళ కేబినెట్ భేటీలో ఆమోదించింది. ఉద్యోగుల భద్రత కోసం సీపీఎస్ స్థానంలో ఏపీ జీపీఎస్ బిల్లు తీసుకొచ్చినట్లు ప్రకటించింది. పాత ఫించను పథకానికి సమానండే ఉండేలా ఈ పథకాన్ని రూపకల్పన చేసింది ఏపీ ప్రభుత్వం. ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ తరువాత వచ్చే 50 శాతం ఫించనకు తగ్గకుండా, డీఏ క్రమంగా పెరిగేలా కొత్త విధంగా కొత్త బిల్లును రూపొందించారు. గ్యారెంటెడ్ పెన్షన్ బిల్ 2023 పేరుతో బిల్లు ముసాయిదాను కేబినెట్ ఆమోదించిన విషయం విదితమే.