AP Intermediate Supplementary Exams fee deadline extended: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ విద్యార్థులకు కీలక అప్డేట్ వచ్చింది. ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు (IPASE మే 2026) కోసం ఫీజు చెల్లింపు గడువును ప్రభుత్వం ఈ నెలాఖరు (ఏప్రిల్ 30) వరకు పొడిగించింది. ఈ నిర్ణయంతో విద్యార్థులకు మరో అవకాశం కల్పించినట్లైంది.
అధికారుల ప్రకారం, ఇది ఒకసారి మాత్రమే ఇచ్చిన గడువు పొడిగింపు అని స్పష్టం చేశారు. ఈ గడువు తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ మరింత పొడిగింపు ఉండదని తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని తప్పక వినియోగించుకోవాలని సూచించారు. ఫీజు చెల్లింపు విధానం విషయానికి వస్తే, విద్యార్థులు తమ సంబంధిత జూనియర్ కాలేజీల ద్వారా మాత్రమే చెల్లించాలి. నిర్ణీత గడువులోగా ఫీజు చెల్లించని పక్షంలో పరీక్షలకు హాజరు కావడం సాధ్యం కాదని అధికారులు స్పష్టం చేశారు. కాబట్టి చివరి తేదీ కోసం వేచి ఉండకుండా ముందుగానే ఫీజు చెల్లించడం మంచిదని సూచించారు.
పరీక్షల షెడ్యూల్ ప్రకారం.. థియరీ పరీక్షలు మే 21 నుంచి జూన్ 4, 2026 వరకు జరుగుతాయి. ప్రతిరోజూ రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం సెషన్ 9 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం సెషన్ 2:30 నుంచి 5:30 వరకు ఉంటుంది. ప్రాక్టికల్ పరీక్షలు జూన్ 7 నుంచి జూన్ 11 వరకు జిల్లా కేంద్రాల్లో నిర్వహించనున్నారు. అలాగే, ఎథిక్స్ & హ్యూమన్ వాల్యూస్ పరీక్ష జూన్ 5న, ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష జూన్ 6న జరగనున్నాయి.
ఈ సప్లిమెంటరీ పరీక్షలు ఫెయిల్ అయిన లేదా తమ మార్కులు మెరుగుపరుచుకోవాలనుకునే విద్యార్థులకు మంచి అవకాశంగా నిలుస్తాయి. అకడమిక్ ఇయర్ వృథా కాకుండా ఉండటంతో పాటు, మంచి మార్కులతో ఉన్నత విద్యలో చేరే అవకాశం కూడా లభిస్తుంది.
