NTV Telugu Site icon

AP Inter Exams: ఏపీలో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు!

Students Exams

Students Exams

AP Inter Exams Starts From Today: ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ఆరంభం కానున్నాయి. ఇంటర్ పరీక్షల నిర్వహణకు ఇంటర్మీడియట్ బోర్డు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసింది. షెడ్యూలు ప్రకారం మార్చి 1 నుంచి 20 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు. శుక్రవారం మొదటి ఏడాది, శనివారం రెండో ఏడాది విద్యార్థులకు పరీక్షలు ప్రారంభమవుతాయి. రోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ పరీక్ష జరగనుంది. నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను పరీక్షకు అనుమతించరు.

ఈ విద్యా సంవత్సరంలో మొత్తంగా 10,52,221 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. వారిలో మొదటి సంవత్సరం 4,73,058 మంది.. రెండో సంవత్సరం 5,79,163 మంది ఉన్నారు. మొత్తం 26 జిల్లాల్లో 1,559 సెంటర్లను ఇంటర్మీడియట్ బోర్డు సిద్ధం చేసింది. పరీక్షల పర్యవేక్షణకు 147 ఫ్లయింగ్‌ స్క్వాడ్స్, 60 సిట్టింగ్‌ స్క్వాడ్స్‌ను బోర్డు నియమించింది. వీరితో పాటు బోర్డు నుంచి జిల్లాకు ఇద్దరు అధికారులను పంపించారు. పరీక్షలు జరిగే ప్రతి గదిలోనూ సీసీ టీవీ కెమరాలను కూడా ఏర్పాటు చేశారు.

Also Read: March 1 New Rules : నేటి నుంచి అమలుకానున్న కొత్త రూల్స్..

పరీక్షల సరళిని పర్యవేక్షించేందుకు ఏపీలోని ప్రతి జిల్లాలోనూ ఓ కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేశారు. పరీక్షలపై ఇంటర్‌ బోర్డు ‘డిజిటల్‌ నిఘా’ను ఏర్పాటు చేసింది. పరీక్ష పేపర్లకు మూడు స్థాయిల్లో ‘క్యూఆర్‌’ కోడ్‌ను ఉంచారు. పేపర్‌ ఎక్కడ ఫొటో తీసినా, స్కాన్‌ చేసినా.. వెంటనే తెలిసిపోయేలా చర్యలు తీసుకున్నారు. దివ్యాంగ విద్యార్థులకు గ్రౌండ్‌ ఫ్లోర్‌లోనే సెంటర్లను కేటాయించారు. వీరికి మరో గంట అదనపు సమయం, పరీక్ష రాసేందుకు సహాయకులను అందుబాటులో ఉంచారు.

Show comments