అమరావతి కేంద్రంగా కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమమే ధ్యేయంగా అడుగులు వేస్తోంది. 2029 నాటికి రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సొంతిల్లు ఉండాలనేదే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఏపీ మహిళా సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్మన్ పీతల సుజాత స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్ల స్వల్ప వ్యవధిలోనే ఏకంగా 5.50 లక్షల గృహప్రవేశాలు ఘనంగా నిర్వహించి, పేదల సొంతింటి కలను సాకారం చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని తెలిపారు.
ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ పేదలకు నాణ్యమైన ఇళ్లను అందిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో గృహ నిర్మాణ రంగాన్ని ఆధునీకరించే దిశగా విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టామని, ఇందులో భాగంగా దేశంలోనే తొలిసారిగా అత్యాధునిక 3డీ టెక్నాలజీతో తెనాలిలో ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ నూతన సాంకేతికత ద్వారా నాణ్యమైన ఇళ్లను అతి తక్కువ సమయంలో వేగంగా నిర్మించడానికి వీలవుతుందని తెలిపారు.
తెనాలిలో ప్రతిష్టాత్మకంగా ఏకకాలంలో 3 లక్షల ఇళ్ల నిర్మాణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని, ఇవి పేదల జీవితాల్లో వెలుగులు నింపుతాయని ధీమా వ్యక్తం చేశారు. గత పాలకుల విధానాల వల్ల ఇళ్ల నిర్మాణాలు నూకలు నోచుకోలేదని, కానీ ప్రస్తుత ప్రభుత్వం మాత్రం వేగవంతమైన చర్యలతో గృహనిర్మాణాలను ముందుకు తీసుకెళ్తోందని చెప్పారు. మరోవైపు.. గత వైకాపా ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
కేవలం ‘సెంటు భూమి పట్టా’ పేరుతో జగన్ అండ్ కో ఐదేళ్ల కాలంలో సుమారు రూ. 7 వేల కోట్ల భారీ అక్రమార్జనకు పాల్పడ్డారని ఆరోపించారు. పేదల సంక్షేమాన్ని గాలికొదిలి, భూముల పేరుతో వేల కోట్లు దోచుకున్నారని మండిపడ్డారు. గత పాలకుల అవినీతి అక్రమాలను ప్రజలు గమనిస్తున్నారని, కూటమి ప్రభుత్వ పారదర్శక పాలనలో ప్రతి పేదవాడికి న్యాయం జరుగుతోందని సుజాత పేర్కొన్నారు.

