Site icon NTV Telugu

High Court: విద్యాశాఖ అధికారుల తీరుపై హైకోర్టు సిరీయస్.. ఐఏఎస్ అధికారికి నోటీసులు..!

Ap High Court

Ap High Court

High Court: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ అధికారుల వ్యవహార శైలిపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులకు కనీస గౌరవం కూడా చూపడం లేదని మండిపడిన హైకోర్టు, “పవర్‌ఫుల్ వ్యక్తుల కింద పనిచేస్తున్నామని.. ఎవరు ఏమి చేయలేరనే భావనలో అధికారులు ఉన్నట్లుగా కనిపిస్తోంది” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.

Trivikram-Sunil : ఒకే రోజున పెళ్లి చేసుకున్న త్రివిక్రమ్-సునీల్

కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో పార్ట్‌టైం పోస్ట్‌గ్రాడ్యుయేట్ టీచర్లుగా పనిచేస్తున్న తమను అర్ధాంతరంగా తొలగించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు.. వారిని కొనసాగించాలని సింగిల్ జడ్జ్ ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఉత్తర్వులను 2024 జనవరిలో ధర్మాసనం ముందు అధికారులు అప్పీల్ చేసిన విషయం కోర్టు దృష్టికి వచ్చింది.

గత విచారణ సందర్భంగా.. ఉత్తర్వులను అమలు చేస్తామని ప్రభుత్వ న్యాయవాది హామీ ఇచ్చిన విషయాన్ని పిటిషనర్ల తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకురాగా, దీనిపై హైకోర్టు మరింత ఆగ్రహం వ్యక్తం చేసింది. సింగిల్ జడ్జ్ ఆదేశాలను అమలు చేయకుండా నిర్లక్ష్యం వహించినందుకు సర్వశిక్ష అభియాన్ రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్‌పై సుమోటో కోర్టు దిక్కరణ కేసు నమోదు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఐఏఎస్ అధికారి బి. శ్రీనివాసరావుకు నోటీసులు జారీ చేసింది.

“ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న అధికారులు కోర్టుతో ఘర్షణ పడాలని ఆశిస్తున్నారా?” అంటూ ప్రశ్నించిన హైకోర్టు.. “అదే ఆలోచన అయితే ఎలా డీల్ చేయాలో మాకు తెలుసు” అని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తదుపరి విచారణ నాటికి ఐఏఎస్ అధికారి బి. శ్రీనివాసరావు వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది.

Employees Retirement Age: ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు మరోమారు పెరగనుందా..?

ఈ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాది రామచంద్రరావు.. విజయనగరం అడిషనల్ ప్రాజెక్టు డైరెక్టర్ చేసిన తప్పుకు స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్‌ను బాధ్యుడిని చేయడం సరికాదని వాదనలు వినిపించారు. అయితే ఉన్నతాధికారులు కేవలం ఆదేశాలు ఇవ్వడమే కాకుండా, వాటి అమలు జరిగేలా చూసే బాధ్యత కూడా వారిదేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసు విచారణను నెల రోజుల తర్వాతకి హైకోర్టు వాయిదా వేసింది.

Exit mobile version