AP: ఏపీ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నూతన కమిటీ నియామకం..

Ap Filmss

Ap Filmss

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సినిమా, టెలివిజన్ , రంగస్థల కళల రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఏపీ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్, అండ్ థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నూతన చైర్మన్, వైస్ చైర్మన్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల నియామకాలను అధికారికంగా ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

కీలక పదవుల నియామకం..
కార్పొరేషన్ ఛైర్మన్ గా.. సంస్థకు కొత్త జవసత్వాలు అందించే బాధ్యతను పి. భరత్ భూషణ్ కి అప్పగించారు. చైర్మన్ హోదాలో ఆయన కార్పొరేషన్ భవిష్యత్తు ప్రణాళికలను ముందుండి నడిపిస్తారు. సంస్థ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి చిక్కాల మెహర్ రమేష్ కుమార్ ను వైస్ చైర్మన్‌గా ప్రభుత్వం నియమించింది. కేవలం చైర్మన్, వైస్ చైర్మన్‌లకే పరిమితం కాకుండా.. పరిశ్రమలోని వివిధ రంగాలకు చెందిన నిపుణులకు ఈ బోర్డులో స్థానం కల్పించారు. చైర్మన్, వైస్ చైర్మన్‌లతో పాటు మరో 14 మందిని డైరెక్టర్లుగా నియమిస్తూ ప్రభుత్వం సమతుల్యమైన కమిటీని ఏర్పాటు చేసింది.

ఈ బోర్డులో నియమితులైన సభ్యులందరి వివరాలను పరిశీలిస్తే.. పి. భరత్ భూషణ్ (ఛైర్మన్), చిక్కాల మెహర్ రమేష్ కుమార్ (వైస్ ఛైర్మన్) లతో పాటు డైరెక్టర్లుగా సుమన్ తల్వార్, ఎస్. శివాజీ, చదలవాడ శ్రీనివాసరావు, బుర్రా సాయిమాధవ్, వై. ఝాన్సీ, కూచిభొట్ల సుబ్రహ్మణ్య వివేకానంద, వి. సముద్ర, కే. ఉమామహేశ్వర రావు, మీర్.ఎస్, కందిమళ్ల సాంబశివరావు, ఏ. సత్యనారాయణ, ఎస్. వెంకట కృష్ణారెడ్డి, జీ. రాజ్ వెంకటేశ్వర యాదవ్, డి. సత్యనారాయణలు ఉన్నారు.

ఈ నియామకాల ప్రాధాన్యత..
ఈ నూతన బోర్డులో సీనియర్ నటులు, దర్శకులు, నిర్మాతలు, ప్రముఖ రచయితలు, సాంకేతిక నిపుణులకు చోటు దక్కింది. పరిశ్రమలోని అన్ని విభాగాల సమస్యలపై అవగాహన ఉన్న వ్యక్తులను ఎంపిక చేయడం ద్వారా, క్షేత్రస్థాయిలో కళాకారులకు న్యాయం జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లో సినీ పరిశ్రమ అభివృద్ధిని వేగవంతం చేయడం, స్థానిక థియేటర్ల సమస్యలను పరిష్కరించడం, టెలివిజన్ రంగానికి ప్రోత్సాహం అందించడంతో పాటు.. నిర్వీర్యమవుతున్న నాటకరంగానికి (థియేటర్) పూర్వ వైభవం తీసుకురావడంలో ఈ కొత్త కమిటీ కీలక పాత్ర పోషించనుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల కళాకారులు, పరిశ్రమ వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.