NTV Telugu Site icon

Government Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. 3,220 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

Appsc

Appsc

Government Jobs: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిరుద్యోగులకు మరోసారి శుభవార్త చెప్పింది.. ఇప్పటికే వివిధ శాఖల్లో వరుసగా ఉద్యోగాలు భర్తీ చేస్తూ వస్తుండగా.. ఇప్పుడు విశ్వవిద్యాలయాల్లో ఖాళీల భర్తీకి పూనుకుంది.. దీనికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్‌ ద్వారా యూనివర్సిటీల్లో 3,220 పోస్టులు భర్తీ చేయనున్నారు.. అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.. రాష్ట్రంలోని 18 యూనివర్సిటీల్లో ఖాళీలు భర్తీ చేయనున్నారు.. అయితే, రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో 17 ఏళ్ల తర్వాత రిక్రూట్మెంట్ జరుగుతుండడం విశేషంగా చెప్పుకొవాలి..

3,220 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల కాగా.. అందులో 418 ప్రొఫెసర్, 801 అసోసియేట్ ప్రొఫెసర్, 2001 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయనున్నారు.. నేటి నుంచి ఉన్నత విద్యా మండలి ఉమ్మడి పోర్టల్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు ఒకే దరఖాస్తు ఫీజుతో అన్ని వర్సిటీలకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంటుంది.. ఇక, ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) ద్వారా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించనున్నారు.. కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేస్తున్న వారికి గరిష్టంగా 10 మార్కుల వెయిటేజ్ ఇవ్వనుంది ఉన్నత విద్యామండలి.

ఇక దరఖాస్తు రుసుము విషయానికి వస్తే.. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుకు ఓపెన్‌ కేటగిరీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.2,500 రుసుము నిర్ణయించగా.. ఎస్సీ, ఎస్టీ, పీబీడీలు (పర్సన్‌ బెంచ్‌ మార్క్‌ విత్‌ డిజేబిలిటీ) అభ్యర్థులకు రూ.2 వేలు, ప్రవాస భారతీయులైతే 50 డాలర్లు/రూ.4.200 ఆన్‌లైన్‌లో దరఖాస్తుతో పాటు ఫీజు చెల్లించాల్సి ఉంటుందని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.. ప్రొఫెసర్, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు అన్ని కేటగిరీల అభ్యర్థులు రూ.3 వేల రుసుము చెల్లించాల్సి ఉండగా.. ప్రవాస భారతీయులైతే ప్రొఫెసర్‌ పోస్టుకు రూ.150 డాలర్లు/రూ.12,600, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టుకు 100 డాలర్లు/రూ.8,400 దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

ఇవాళ్టి నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు స్వీకరణ ప్రారంభం కానుండగా.. దరఖాస్తుల స్వీకరణ, ఫీజు చెల్లింపునకు 20.11.2023 తుది గడువుగా పెట్టారు.. పోస్టు ద్వారా దరఖాస్తు కాపీ, ఇతర పత్రాల సమర్పించేందుకు గడువు 27.11.2023గా నిర్ణయించారు.. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుకు నిర్వహించే స్క్రీనింగ్‌ టెస్ట్‌కు అనర్హులైన అభ్యర్థుల ప్రాథమిక జాబితాను 30.11.2023న విడుదల చేస్తారు.. ఇక, 07.12.2023 వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నారు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్ట్‌ స్క్రీనింగ్‌ టెస్టుకు ఎంపికైన అభ్యర్థుల జాబితా 08.12.2023న ప్రదర్శిస్తారు..