Site icon NTV Telugu

CM Chandrababu: ఏపీని గ్లోబల్ లాజిస్టిక్స్ హబ్‌గా తీర్చిదిద్దుతాం: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu

Chandrababu Naidu

CM Chandrababu: విశాఖపట్నంలో గ్లోబల్‌ ఫోరం ఫర్‌ సస్టెయినబుల్‌ ట్రాన్సఫర్మేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన విశాఖ- ఈస్ట్ కోస్ట్ మారిటైమ్ లాజిస్టిక్స్ సమ్మిట్‌కు ముఖ్యఅతిథిగా ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మారిటైమ్ లాజిస్టిక్స్ అభివృద్ధిపై దేశంలోని వివిధ పోర్టులు, కార్గో హ్యాండ్లింగ్ కంపెనీలకు చెందిన 62 మంది సీఈఓలతో సమావేశం అయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలలో భాగంగా ఏపీని గ్లోబల్ లాజిస్టిక్స్ హబ్‌గా తీర్చిదిద్దుతాం అని అన్నారు. ఏపీ మారిటైమ్ లాజిస్టిక్స్ రంగంలో ఉన్న అవకాశాలు, పోర్టు కార్గో హ్యాండ్లింగ్ మౌలిక సదుపాయాల కల్పన, రోడ్- రైలు కనెక్టివిటీలపై సమావేశంలో చర్చించారు. పోర్టుల పరిధిలో ఉన్న వివిధ ప్రాంతాలు, హింటర్ ల్యాండ్ కనెక్టివిటి, కార్గో రవాణా అంశాల గురించి మాట్లాడారు.

READ ALSO: Shivani Nagaram : కొత్త హీరోయిన్స్ చాలా మంది వచ్చి ఉండొచ్చు కానీ

రాష్ట్రంలోని వివిధ ఓడరేవుల్లో టెర్మినళ్ల ఆధునీకరణ, కోల్డ్ చైన్ సదుపాయాలు, షిప్ బిల్డింగ్ మరమ్మతులు, ఎయిర్ కార్గో కనెక్టివిటీ అంశాలపై సీఎం సుదీర్ఘంగా చర్చించారు. మారిటైమ్ లాజిస్టిక్స్‌లో అంతర్జాతీయంగా అనుసరిస్తున్న ప్రమాణాలు, ఏపీలో ఉన్న అవకాశాలు, పెట్టుబడుల గురించి సమావేశంలో ఆయన వివరించారు.
ప్రతీ పోర్టుకూ కనెక్టివిటీ మాస్టర్ ప్లాన్ రూపొందించాలని అన్నారు. రాష్ట్రంలో లాజిస్టిక్స్ యూనివర్శిటీ, సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ త్వరలో ఏర్పాటు చేస్తామని సీఎం చెప్పారు. లాజిస్టిక్స్ పార్కుల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. విశాఖ, అమరావతి, తిరుపతి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు ఎయిర్ కార్గో రవాణాకు అనుకూలంగా మారుస్తామన్నారు. జీఎస్డీపీలో లాజిస్టిక్స్ రంగం వాటా 3 శాతానికి పెంచుకునే అవకాశం ఉందన్నారు. పోర్ట్ ఆధారిత ఎకానమీపైనే ఇప్పుడు ప్రధానంగా దృష్టి పెట్టామన్నారు. అనకాపల్లిలో ఆర్సెలార్ మిట్టల్ త్వరలోనే స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. విశాఖ పోర్టు ద్వారా ఇనుప ఖనిజాన్ని తెచ్చుకుంటారు. దానికి అనుబంధంగా టౌన్ షిప్, ఇతర ఆర్థిక కార్యకలాపాలు చేపట్టనున్నట్లు చెప్పారు. మూలపేట, మచిలీపట్నం, రామాయపట్నం కాకినాడ సెజ్ వంటి ప్రాంతాల్లో మొత్తంగా 10 వేల ఎకరాల భూమి ఈ అవసరాల కోసం వినియోగిస్తామని పేర్కొన్నారు.

త్వరలో కంటైనర్ కార్గోగా మారాలి..
ప్రస్తుతం 90 శాతం కార్గో అంతా బల్క్‌లోనే ఉందని, త్వరలో కంటైనర్ కార్గోగా మారాలని చెప్పారు. దుగరాజపట్నం సహా వివిధ ప్రాంతాల్లో షిప్ బిల్డింగ్, రిపైర్లు, కంటైనర్లు, షిప్ రీసైక్లింగ్ పరిశ్రమలు పెట్టేందుకు అవకాశం ఉందన్నారు. డిజిటల్ లాజిస్టిక్స్, కార్గో ట్రాకింగ్ వంటి సాంకేతికతలు రావాలి, పోర్టులు గ్రీన్ హబ్స్‌గా మారాలని చెప్పారు. ఏపీలో రైల్ లింక్డ్ టెర్మినళ్లు ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉందన్నారు. లాజిస్టిక్స్ కార్పోరేషన్‌ను కూడా ప్రత్యేకంగా ఏపీలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. లాజిస్టిక్స్ పార్కులు, పోర్టులు, అంతర్గత జలరవాణా మార్గాల అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈస్ట్ కోస్ట్‌లో ఏపీనే అగ్రస్థానంలో ఉందని, దీన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లేందుకు పాలసీ రూపోందిస్తామని అన్నారు. దీనికి 15-20 మందితో కూడిన సలహా బోర్డును ఏర్పాటు చేస్తామన్నారు. విశాఖ త్వరలోనే టెక్నాలజీ హబ్ ఆఫ్ ఇండియాగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున డేటా సెంటర్లు ఇక్కడికి వస్తాయని, సీ కేబుల్ ద్వారా ఇతర ప్రపంచం కూడా విశాఖతో అనుసంధానం అవుతుందన్నారు. ప్రపంచ ప్రమాణాలతో కూడిన లాజిస్టిక్స్ హబ్‌గా ఏపీ మారుతుందని అన్నారు. సమావేశంలో మంత్రులు బీసీ జనార్ధన్ రెడ్డి, డోలా బాలవీరాంజనేయ స్వామి, మారిటైమ్ బోర్డు అధికారులు పాల్గొన్నారు.

READ ALSO: Krish : ఘాటి అనుష్క కెరీర్ లో ఐకానిక్ మూవీ.. ఒక కొత్త ప్రపంచాన్ని చూస్తారు!

Exit mobile version