Site icon NTV Telugu

Deputy CM Amzath Basha: హజ్ యాత్రికులపై అదనపు భారం లేకుండా చూస్తాం..

Amzath Basha

Amzath Basha

Deputy CM Amzath Basha: ఆంధ్రప్రదేశ్‌ నుంచి వెళ్లే హజ్ యాత్రికులపై అదనపు ఆర్ధిక భారం లేకుండా చూస్తామని తెలిపారు ఏపీ డిప్యూటీ సీఎం, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అంజాద్‌ బాషా.. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. హజ్ యాత్రికులు ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు.. కేంద్రాన్ని మరోసారి పరిశీలించాలని కోరాం. విమాన టిక్కెట్ ధరల్లో ఉన్న వ్యత్యాసం వల్లే ఖర్చు పెరిగిందన్నారు. విమాన టిక్కెట్ ధరలను తగ్గించమని కోరాం. లేదా, “ఎంబార్కేషన్ పాయుంట్” ను విజయవాడ కాకుండా, హైదరాబాద్ లేదా బెంగుళూరుకు మార్చమని అడిగామని తెలిపారు. అదనపు ఆర్ధిక భారం “హజ్” యాత్రికులు మోయాల్సిన పరిస్థితే వస్తే, విధిలేని పరిస్థితుల్లో, ఆ మొత్తం ఆర్ధిక భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు.

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పై రాజకీయ పార్టీలు విమర్శలు చేయడం తగదన్నారు అంజాద్‌ బాషా.. విజయవాడ నుంచి “హాజ్” యాత్ర కు వెళ్ళే యాత్రికులకు ఒక్కొక్కరికి 3 లక్షల 88 వేల రూపాయలు ఖర్చు అవుతుందని “సెంట్రల్ హజ్ కమిటీ ఆఫ్ ఇండియా”, కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా సర్క్యులర్‌ జారీ చేశాయని తెలిపారు. అదే, హైదరాబాద్ నుంచి వెళ్ళే హజ్ యాత్రికులకు ఒక్కొక్కరికి 3 లక్షల 5 వేల రూపాయలు, బెంగుళూరు నుంచి 3 లక్షల 4 వేలు నిర్ణయించారు.. కానీ, ఏపీ నుంచి హజ్ యాత్రుకులకు ఇది భారం అవుతుంది. పునఃపరిశీలించమని పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను కలిసి కోరామని తెలిపారు.

విజయవాడ నుంచి “హజ్” యాత్రకు వెళ్ళే 1985 మంది యాత్రికులు అదనపు ఆర్ధిక భారం మోయాల్సి వస్తుంది.. ఏపీ నుంచి వెళ్ళే హజ్ యాత్రికుడు అదనంగా 83 వేల రూపాయల ఖర్చును భరించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. అయితే, టెండర్లు జారీ చేయడం ద్వారానే విమాన టిక్కెట్ ధరలు నిర్ణయం జరుగుతుందని కేంద్ర మంత్రి సింధియా తెలిపారన్నారు. అయినా, ఎయిర్ లైన్స్ సంస్థతో మాట్లాడతామని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ విషయంపై కేంద్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీని కూడా రేపు కలవనున్నట్టు వెల్లడించారు ఏపీ డిప్యూటీ సీఎం, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అంజాద్‌ బాషా.

Exit mobile version