NTV Telugu Site icon

CM YS Jagan: సీఆర్‌డీఏలో పేదల ఇళ్లకు శ్రీకారం.. 50 వేలకు పైగా ఇళ్లకు నేడే శంకుస్థాపన

Ys Jagan

Ys Jagan

CM YS Jagan: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఈ రోజు గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు.. ఆర్ 5 జోన్‌లో ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.. 50,793 ఇళ్ల నిర్మాణాలకు ఈ రోజు శ్రీకారం చుట్టనున్నారు.. ఈ ఇళ్ల నిర్మాణానికి రూ.1,829.57 కోట్లు వెచ్చించనున్నంది వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సర్కార్‌.. ఈడబ్ల్యూఎస్ లేఅవుట్లలో వ్యయంతో అన్ని మౌలిక వసతులతో 50,793 ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నారు.. సీఆర్‌డీఏ పరిధిలోని గుంటూరు జిల్లా కృష్ణాయపాలెం లే అవుట్‌లో ఈ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.. 71, 811 ఎకరాల్లో ఇళ్ల పట్టాలు, రిజిస్ట్రేషన్లు కూడా చేయించనున్నారు. గూడు లేని పేద అక్కచెల్లెమ్మలకు స్థిరనివాసం సమకూర్చి, వారి భవిష్యత్తుకు భరోసా కల్పించాలన్న కృతనిశ్చయంతో అడుగులు వేస్తున్నారు సీఎం వైఎస్‌ జగన్‌.

Read Also: Shiva Stotram: సోమవారం ఈ స్తోత్రాలు వింటే గ్రహ, అపమృత్యు దోషాలు తొలగిపోతాయి

సీఆర్డీఏ పరిధిలో 1,402.58 ఎకరాలు, 25 లేఅవుట్‌లలో 50,793 మందికి ఈ ఏడాది మే 26న ఉచితంగా ఇళ్ల పట్టాలు అందించిన విషయం తెలిసిందే కాగా.. ఒక్కో ప్లాట్‌ రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల విలువ చేసే రూ.1,371.41 కోట్ల ఖరీదైన భూమిని పేదలకు ఉచితంగా అందజేశారు.. ఇక, ఆయా లేఅవుట్‌లలో రూ.384.42 కోట్లతో మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పించనుంది. మరోవైపు.. విద్య, ఆరోగ్య సేవలు అందించేందుకు రూ.73.74 కోట్లతో 11 అంగన్‌వాడీ కేంద్రాలు, 11 పాఠశాలలు, 11 డిజిటల్‌ లైబ్రరీలు, 12 ఆస్పత్రుల నిర్మాణం కూడా చేపట్టనుంది. లేఅవుట్ల పరిధిలో పచ్చదనాన్ని పెంపొందించి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటుచేసేందుకు రెండు దశల్లో 28,000 మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణకు చర్యలు తీసుకోనున్నారు. ఇక, ఈ ఇళ్ల నిర్మాణం పూర్తి అయితే.. మౌలిక సదుపాయాల ఏర్పాటుతో ఒక్కో పేద అక్కచెల్లెమ్మ చేతుల్లో దాదాపు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలకు పైగా విలువైన స్థిరాస్తిని పెట్టబోతున్నారు సీఎం జగన్‌.. ఈ లెక్కన ఏపీ గృహ నిర్మాణ సంస్థ ద్వారా సీఆర్‌డీఏలోని ఈడబ్ల్యూఎస్‌ లేఅవుట్లలో రూ.1,829.57 కోట్ల వ్యయంతో పేదలకు పక్కా గృహాలు నిర్మించనున్నారు..