CM YS Jagan Gudivada Tour: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కృష్ణా జిల్లా గుడివాడలో పర్యటించబోతున్నారు.. గుడివాడలోని మల్లాయపాలెం టిడ్కో గృహ సముదాయాన్ని ప్రారంభించనున్న ఆయన.. టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు.. దీని కోసం ఈ రోజు ఉదయం 9 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న ముఖ్యమంత్రి జగన్.. తొమిదిన్నరకు గుడివాడ మల్లయ్యపాలెంకు చేరుకుంటారు.. మల్లయ్యపాలెం జగనన్న కాలనీలోని టిడ్కో ఇళ్లు పంపిణీ చేస్తారు.. వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.. అనంతరం బహిరంగ సభను ఉద్దేశించి మాట్లాడనున్నారు సీఎం జగన్.. ఇక, హెలిపాడ్ దగ్గర స్థానిక పార్టీ నేతలతో ఇంటరాక్ట్ కాబోతున్నారు ఏపీ ముఖ్మంత్రి.. మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో తిరిగి తాడేపల్లికి చేరుకోనున్నారు..
మొత్తంగా ఈ రోజు 8,912 టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు సీఎం వైఎస్ జగన్. కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలో 300 ఎకరాల్లో 8,912 ఇళ్లను నిర్మించారు. అంతేకాకుండా, నవరత్నాలు-పేదలందరికీ ఇల్లు పథకం కింద టిడ్కో కాలనీకి ఆనుకుని 6,700 వ్యక్తిగత ఇళ్లు కూడా నిర్మిస్తున్నారు. మొత్తంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో 27,872 ఇళ్లు నిర్మాణం జరుగుతోంది. కృష్ణా జిల్లా వ్యాప్తంగా AP TIDCO.. పట్టణ ప్రాంతాల్లో 27,872 ఇళ్లను నిర్మిస్తోంది. విజయవాడ, మచిలీపట్నం, గుడివాడ, జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు, ఉయ్యూరులో ఈ ఇళ్లను నిర్మిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లోని మధ్యతరగతి, పేదల గృహ అవసరాలను తక్కువ ఖర్చుతో తీర్చడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రూపొందించిన ఉమ్మడి వెంచర్ TIDCO గృహాలు నిర్మిస్తున్నారు..
ఇప్పటికే 8, 912 టిడ్కో ఇళ్లు పూర్తి చేశారు.. అక్కడే మరో 178.63 ఎకరాల్లో 7,728 ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నారు.. వీటిలో 4,500 ఇళ్ల నిర్మాణం కొనసాగుతోంది.. ఇక, మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సొంత నియోజకవర్గం కావడంతో ఆయన దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.. సీఎం పర్యటనకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.. కాగా, గతంలోనే ఈ కార్యక్రమం నిర్వహించాల్సి ఉండగా.. సీఎం పర్యటన వాయిదా పడిన విషయం తెలిసిందే.. ఇవాళ మొత్తంగా లబ్ధిదారులకు ఇళ్లు పంపిణీ చేయనున్నారు.