Site icon NTV Telugu

Dr BR Ambedkar Statue: నేడు అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం జగన్‌.. విజయవాడలో ట్రాఫిక్‌ ఆంక్షలు

Ambedkar Statue

Ambedkar Statue

Dr BR Ambedkar Statue: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. బెజవాడ స్వరాజ్య మైదానంలో నిర్మిస్తున్న భారతరత్న, బాబాసాహెబ్‌ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ స్మృతివనం ప్రారంభానికి సిద్ధమైంది.. చరిత్రలో నిలిచిపోయేలా ‘సామాజిక న్యాయ మహాశిల్పం’ ముస్తాబైంది.. ఈ రోజు ఆ విగ్రహాన్ని ఆవిష్కరించి జాతికి అంకితం చేయనున్నారు ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. గతంలోనే అంబేద్కర్‌ స్మృతివనాన్ని ప్రారంభిచాలని ప్రభుత్వం నిర్ణయించినా.. పనుల్లో జాప్యం కారణంగా పలు మార్లు వాయిదా పడుతూ వచ్చింది.. ఇక, ఇప్పుడు అన్ని పనులను యుద్ధప్రతిపాదికన పూర్తి చేసి.. నేడు ప్రారంభించబోతున్నారు.. అత్యంత అందంగా తీర్చిదిద్దుతున్న ఈ ప్రాంగణం ప్రపంచస్థాయి పర్యాటకులను సైతం ఆకర్షించే వేదికగా మారుతుందని అంచనా వేస్తున్నారు.. దేశంలో ఇదే అతిపెద్ద విగ్రహం కావడం మరో విశేషం. 206 అడుగుల భారీ అంబేద్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.. అందులో 81 అడుగుల బేస్ ఉండగా.. దానిపై 125 అడుగుల విగ్రహాన్ని అత్యంత సుందరంగా ముస్తాబు చేశారు.

ఇక, రాత్రి సమయంలో ప్రత్యేక లైటింగ్‌తో సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా నిలుస్తోంది, సీఎం వైఎస్‌ జగన్‌ స్వయంగా ఈ ప్రాజెక్టును పర్యవేక్షించి, అత్యంత అద్భుతంగా రూపొందించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు ఆయన సమీక్షలు చేస్తూ.. కీలక సూచనలు చేశారు.. మొత్తంగా స్టాట్యూ ఆఫ్‌ సోషల్‌ జస్టిస్‌ ను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పూర్తిచేశారు.. ఇక, ఈ రోజు అంబేద్కర్‌ స్మృతివనం ఆవిష్కరించనుండగా.. రేపటి నుంచి అంటే 20వ తేదీ నుంచి సామాన్య ప్రజలకు కూడా స్మృతివనంలోకి ప్రవేశం కల్పిస్తారు. 18.18 ఎకరాల్లో 404.35 కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మాణం పూర్తి చేశారు.. అందమైన గార్డెన్, వాటర్‌ బాడీస్, మ్యూజికల్‌ ఫౌంటేన్లు, చిన్నపిల్లలు ఆడుకోవటానికి, వాకింగ్‌ చేసుకోవటానికి వీలుగా స్మృతివనాన్ని తీర్చిదిద్దారు.. పర్యటకులకు ఇబ్బంది లేకుండా పార్కింగ్‌ సౌకర్యం కూడా కల్పించారు.

అంబేద్కర్‌ స్మృతి వనంలో ఎన్నో హంగులున్నాయి.. గ్రౌండ్, ఫస్ట్, సెకండ్‌ ఫ్లోర్‌లు ఉంటాయి. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో నాలుగు హాల్స్‌ ఉండగా.. ఇందులో ఓ సినిమా హాలు, మిగిలిన మూడు హాళ్లు ఆయన చరిత్ర తెలిపే డిజిటల్‌ మ్యూజియాలు ఏర్పాటు చేశారు.. స్ట్‌ ఫ్లోర్‌లో 2,250 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన నాలుగు హాళ్లుంటాయి. రెండు హాళ్లలో మ్యూజియం, ఒక హాల్‌లో లైబ్రరీ ఉంటాయి. ఇక సెకండ్‌ ఫ్లోర్‌లో 1,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నాలుగు హాల్‌లు నిర్మించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఢిల్లీ నుంచి వచ్చిన డిజైనర్లు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులు చేపట్టి స్మృతివనం ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఇది ప్రపంచంలోనే అంబేడ్కర్‌ జీవిత చరిత్ర తెలిపే అతిపెద్ద మ్యూజియం అంటున్నారు. మినీ థియేటర్లు, ఫుడ్‌కోర్టు, కన్వెన్షన్‌ సెంటర్, వెహికల్‌ పార్కింగ్‌ ఉన్నాయి. కన్వెన్షన్‌ సెంటర్‌ 6,340 చదరపు అడుగుల విస్తీర్ణంలో, 2,000 మంది సీటింగ్‌ సామర్థ్యంతో నిర్మించారు. ఫుడ్‌కోర్టు 8,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. బిల్డింగ్‌ చుట్టూ నీటి కొలనులు, మ్యూజికల్, వాటర్‌ ఫౌంటేన్, ముందుభాగంలో ఉన్నాయి. నీటి కొలనుకు లైటింగ్, బబ్లింగ్‌ సిస్టం ఉన్నాయి. ఇవన్నీ అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీతో కూడి ఉంటాయి. కాలచక్ర మహా మండల పీఠం బౌద్ధ వాస్తు శిల్పకళతో అంబేడ్కర పీఠం (పెడస్టల్‌)ను రూపొందించారు.

నేడు విజయవాడలో ట్రాఫిక్‌ ఆంక్షలు..
నేడు విజయవాడ బందర్ రోడ్డులో సామాజిక న్యాయ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహ ప్రారంభోత్సవ సభ, అంబేద్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు పోలీసులు.. వాహనాల ట్రాఫిక్ మళ్లింపు కొనసాగుతుందని విజయవాడ ట్రాఫిక్ డీసీపీ కే. చక్రవర్తి తెలిపారు. ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చిన ట్రాఫిక్‌ ఆంక్షలు.. రాత్రి 12 గంటల వరకు కొనసాగనున్నాయి.. నగరం వెలుపల నుంచే భారీ, మధ్య తరహా రవాణా వాహనాల రాకపోకలు కొనసాగించాలని చెప్పారు. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం.. విశాఖ నుంచి హైదరాబాద్ కు వాహనాల రాకపోకలను ఇబ్రహీంపట్నం దగ్గర నుంచి జి.కొండూరు, నూజివీడు, హనుమాన్ జంక్షన్ వైపుగా మళ్లిస్తామని డీసీపీ పేర్కొన్నారు. ఇక, విశాఖపట్నం నుంచి చెన్నై వెళ్లే వాహనాలను హనుమాన్ జంక్షన్ బైపాస్ మీదుగా గుడివాడ, పామర్రు, చీరాల, ఒంగోలు జిల్లా మీదుగా మళ్లిస్తామని ట్రాఫిక్ డీసీపీ చక్రవర్తి తెలిపారు. అలాగే, ఈ రోజు విజయవాడలో ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వాహనాలతో పాటు ఆర్టీసీ బస్సుల రాకపోకలను మళ్లిస్తున్నామని చెప్పారు. సభ కోసం వాహనాలలో వచ్చే వారి కోసం ప్రత్యేక పార్కింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. బెంజ్ సర్కిల్ నుంచి పోలీస్ కంట్రోల్ రూమ్ వరకు సభకు పర్మిషన్ ఉన్న వెహికిల్స్ మాత్రమే అనుమతి ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ సభకు సుమారు 1 లక్ష 30 వేల మంది వచ్చే అవకాశం ఉంది.. రాష్ట్రవ్యాప్తంగా 2,600 బస్సులు, 2000 వేలకు పైగా కార్ల కోసం పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేశామని ట్రాఫిక్ డీసీపీ కే. చక్రవర్తి వెల్లడించారు.

Exit mobile version