Site icon NTV Telugu

Jaganannaku Chebudam: జగనన్నకు చెబుదాం… ఏ సమస్యలకు.. ఎలా పరిష్కారం అంటే..?

Ys Jagan

Ys Jagan

Jaganannaku Chebudam: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగనన్నకు చెబుదాం అనే కొత్త పరిష్కార కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది.. ఈ కార్యక్రమాన్ని రేపు అంటే ఈ నెల 9వ తేదీన ప్రారంభించబోతున్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. ప్రజల ఫిర్యాదులను వినడం, వాటిని వెంటనే పరిష్కరించడం ఈ కార్యక్రమం ఉద్దేశంగా పెట్టుకున్నారు.. జగనన్నకు చెబుదాం కోసం 1902తో టోల్‌ఫ్రీ నంబర్‌ ఏర్పాటు చేస్తున్నారు.. మంగళవారం రోజు క్యాంప్‌ కార్యాలయం నుంచి లాంఛనంగా ప్రారంభించనున్నారు సీఎం.. సంతృప్త స్ధాయిలో ప్రజా వినతుల పరిష్కారమే లక్ష్యంగా ఈ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు.. ప్రతి వినతి పరిష్కారం అయ్యే వరకూ ట్రాకింగ్‌ చేయనున్నారు.. సంక్షేమ పథకాలు, ప్రభుత్వ సేవలకు సంబంధించి వ్యక్తిగత స్ధాయిలో మీకు ఎదురయ్యే మీ సమస్యలకు మరింత మెరుగైన, నాణ్యమైన పరిష్కారం చూపాలన్న తపనతో–జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి ప్రారంభిస్తున్నారు.

అయితే, ఇందులో ఎలాంటి ఫిర్యాదులు చేయొచ్చు. ఎవరికి ఫిర్యాదు చేయాలనే దానిపై ప్రజల్లో అనుమానాలు ఉంటాయి. వాటిని ఇప్పుడు నివృత్తి చేసుకుందాం. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుకోవడంలో మీకు ఏమైనా ఇబ్బందులున్నా.. వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక అందుకోవడంలో ఏమైనా సమస్యలు ఉన్నా, రేషన్‌ కార్డు వంటివి పొందడంలో ఏమైనా అవాంతరాలు ఎదురైనా.. రైతన్నలకైనా, అక్కచెల్లెమ్మలకైనా, అవ్వాతాతలకైనా, మరెవరికైనా ప్రభుత్వ సేవలు పొందడంలో ఏమైనా అవాంతరాలు ఎదురైనా.. వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ సేవలు అందుకోవడంలో ఏమైనా సమస్యలున్నా.. రెవెన్యూ రికార్డులకు సంబంధించి ఏమైనా సమస్యలున్నా.. ప్రభుత్వ సేవలకు సంబంధించి మరే ఇతర వ్యక్తిగత ఇబ్బందులున్నా.. ప్రభుత్వ సేవలకు సంబంధించి ఇలాంటి ఏ సమస్య పరిష్కారానికైనా జగనన్నకు చెబుదాం టోల్‌ ప్రీ నంబర్‌ 1902ను సంప్రదించవచ్చు.

ఇక, మీ సమస్యకు పరిష్కారం ఎలా జరుగుతుందనే విషయానికి వస్తే..
1. మీ సమస్యను చెప్పేందుకు 1902 టోల్‌ఫ్రీ నెంబర్‌కు కాల్‌ చేయండి
2. కాల్‌ సెంటర్‌ ప్రతినిధితో మీ సమస్యను చెప్పండి
3. మీ ఫిర్యాదును నమోదు చేసుకుని YSR (యువర్‌ సర్వీస్‌ రిక్వెస్ట్‌) ఐడీని కేటాయిస్తారు
4. ఎప్పటికప్పుడు మీ అర్జీ స్టేటస్‌ గురించి ఎస్‌ఎంఎస్‌ ద్వారా మీకు అప్‌డేట్‌ అందుతుంది
5. సమస్య పరిష్కారం తర్వాత ప్రభుత్వ సేవలపై మీ అభిప్రాయాన్ని పంచుకోండి

ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాల గురించి ప్రజలు తెలుసుకునేందుకు వీలు కల్పించడంతో పాటు వారి నుండి ఫిర్యాదులు స్వీకరించి సత్వర పరిష్కారం అందించడం దీని ఉద్దేశం.. ఐవీఆర్‌ఎస్, ఎస్‌ఎంఎస్‌ ద్వారా పౌరులు ఎప్పటికప్పుడు తమ ఫిర్యాదుల స్ధితిని, వాటి పరిష్కారం గురించి తెలుసుకునే సౌకర్యం ఉంది.. అనేక సమస్యలకు అత్యున్నత స్ధాయిలో పరిష్కారం, ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియను ప్రాజెక్ట్‌ మానిటరింగ్‌ యూనిట్‌లతో పాటు ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి కార్యాలయం పర్యవేక్షిస్తుంది.. వ్యక్తిగా మీకు ఎదురయ్యే సమస్యల పరిష్కారాన్ని ఇంకా మెరుగుపరిచేందుకు చేస్తున్న ప్రయత్నం ఈ వేదిక, మీకు ఎదురయ్యే సామూహిక సమస్యల (కమ్యూనిటీ గ్రీవియెన్సెస్‌) పరిష్కారానికి ఎన్‌ఆర్‌ఈజీఎస్, జీజీఎంపి డిపార్ట్‌మెంట్‌ బడ్జెట్‌ ఎలాగూ ఉన్న విషయం విదితమే.

Exit mobile version