NTV Telugu Site icon

AP Education: మరో విద్యా విప్లవానికి ఏపీ నాంది..

Cm Ys Jagan

Cm Ys Jagan

AP Education: దేశంలోనే మరో విద్యా విప్లవానికి ఆంధ్రప్రదేశ్‌ నాంది పలకబోతోంది.. ఈ రోజు జరిగిన వీసీల సమావేశంలో తన విజన్‌ను స్వయంగా ఆవిష్కరించారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.. తొలిసారిగా టీచింగ్‌, లెర్నింగ్‌లో ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌తో అనుసంధానం చేయనున్నారు.. ఆర్టిఫియల్‌ ఇంటెలిజెన్స్‌, వర్చువల్‌ రియాల్టీ, అగ్‌మాంటెడ్‌ రియాల్టీ, మషిన్‌ లెర్నిగ్‌, ఎల్‌ఎల్‌ఎం, మెటావర్స్‌తో మిళితం చేయడం టార్గెట్‌గా పెట్టుకున్నారు.. 4వ పారిశ్రామిక విప్లవంలో ఏపీ విద్యార్థులను గ్లోబల్‌ లీడర్లుగా తయారు చేయడమే లక్ష్యం అని స్పష్టం చేశారు సీఎం జగన్‌.. అనుసరించేవారిగా కాకుండా టెక్నాలజీ సృష్టికర్తలుగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా చెప్పిన ఆయన.. ప్రాథమిక విద్యనుంచి ఉన్నత విద్యవరకూ సమూల మార్పులకు సీఎం అంకురార్పణ చేయనున్నారు.. పాఠశాల విద్య స్థాయిలో ఒక బోర్డు, ఉన్నత విద్యస్థాయిలో మరొక బోర్డు ఏర్పాటు చేయబోతున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విద్యా సంస్థల్లోని విద్యార్థులకు సమానంగా ఇవి అందాలని యూనివర్శిటీ వైస్‌ ఛాన్సలర్లకు సీఎం దిశా నిర్దేశం చేశారు.

విద్యాశాఖ అధికారులు, విశ్వవిద్యాలయాల వైస్‌ ఛాన్స్‌లర్లతో క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ కీలక సమావేశం నిర్వహించారు.. విద్యారంగంలో కీలక మార్పులపై సాలోచనలు చేశారు.. బోధన, నైపుణ్యాభివృద్ధిలో ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌ అనుసంధానంపై సీఎం కీలకంగా దృష్టి పెట్టారు.. వైస్‌ ఛాన్సలర్లను, రాష్ట్రానికి సంబంధించి విద్యాశాఖలకు సంబంధించిన అధికారులను పిలిపించాం. విద్యారంగంలో ఇప్పుడు జరుగుతున్న మార్పులను గమనిస్తే.. మనం ఒక స్థాయిలో ఉంటే… లక్ష్యం ఇంకో స్థాయిలో ఉంది. ఈ గ్యాప్‌ను పూడ్చాలంటే.. ఏం చేయాలన్నదానిపై ఆలోచనలను పంచుకోవడానికి మీ అందర్నీ ఒక చోటకు పిలిచాను. ఉన్నత విద్యా రంగంలో వైస్‌ఛాన్సలర్లది కీలక పాత్ర. అందుకే మిమ్మల్ని కూడా ఇందులో భాగస్వాములను చేస్తున్నాం అన్నారు సీఎం జగన్‌.

టెక్నాలజీ పరంగా చూస్తే.. మొదటి రివల్యూషన్‌ 1784లో స్టీమ్‌తో రైలు ఇంజన్‌ రూపంలో చూశాం. తర్వాత 100 ఏళ్ల తర్వాత విద్యుత్‌ రూపంలో మరొక రివల్యూన్‌ చూశాం. మూడోది 1960–70 ప్రాంతంలో కంప్యూటర్లు, ఐటీ రంగం రూపేణా మరొక విప్లవం చూశాం. ఇప్పుడు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ రూపంలో నాలుగో విప్లవం దిశగా అడుగులు వేస్తున్నాం. రాబోయే రోజుల్లో విద్యావిధానాన్ని ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ పూర్తిగా మార్చబోతోంది. ఈ అడుగులో మనం వెనుకబడితే.. కేవలం అనుసరించే వాళ్లగానే మనం మిగులుతాం. సరైన సమయంలో తగిన విధంగా అడుగులు వేయగలిగితే.. మనం ఈ రంగాల్లో నాయకులం అవుతాం. ఏఐ అభివృద్ధి చెందుతున్న కొద్దీ.. దీన్ని వినియోగించుకుని, సామర్ధ్యాన్ని పెంచుకునే వర్గం ఒకరు అయితే, ఏఐని క్రియేట్‌ చేసేవారు.. మరొక వర్గంగా తయారవుతారు అన్నారు ఏపీ సీఎం.

గతంలో స్టీం ఇంజిన్, ఎలక్ట్రిసిటీ, కంప్యూటర్‌ విప్లవాల్లో మనం వెనకడుగులోనే ఉన్నాం. మనం ఏదీ క్రియేట్‌ చేసే పరిస్థితిలో లేం. అందుకనే ఆర్టీఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌లో మనం క్రియేటర్లుగా మారడం అన్నది చాలా ముఖ్యమైనది. ఈ రంగంలో మనం లీడర్లుగా తయారు కావడం చాలా ముఖ్యం. ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌లో మనం క్రియేటర్లుగా తయారు కావాలని ఆకాక్షించారు ఏపీ సీఎం.. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ని ఒకవైపు మన విద్యావిధానంలోకి తీసుకువచ్చి.. విద్యార్థులకు బోధన, నేర్చుకునే సమర్థతను పెంచుకోవడంలో ఎలా వాడుకోవాలి? అన్న కార్యక్రమం చేస్తూనే.. రెండోవైపున ఏఐ క్రియట్‌ చేసే స్కిల్స్, టాలెంట్‌ను కూడా మన పిల్లల్లోకి తీసుకుని రావాలి. ఇది కూడా కరిక్యులమ్‌లో భాగం కావాల్సిన అవసరముందన్నారు.

ఇక, మొన్ననే జర్మన్‌ కాన్సులేట్‌ జనరల్‌ నన్ను కలిశారు. జర్మనీ లాంటి దేశంలో నైపుణ్యం ఉన్న మానవవనరుల కొరత ఉందని చెప్పారు. పాశ్చాత్య ప్రపంచం అంతా డెమొగ్రఫిక్‌ ఇన్‌బ్యాలెన్స్‌ ఎదుర్కొంటోంది. మనదేశంలో కాని, మన రాష్ట్రంలోకాని సుమారు 70శాతం మంది పనిచేసే వయస్సులో ఉన్నారు. వీరికి సరైన నాలెడ్జ్, స్కిల్స్‌ ఇవ్వలేకపోతే మనం ప్రపంచానికి మార్గనిర్దేశకులుగా ఉండలేం. ఇది వాస్తవం అన్నారు సీఎం జగన్‌. అందుకే విద్యారంగంలో మార్పులకు మనం శ్రీకారం చుట్టాలి. ఏ రకమైన మార్పులకు శ్రీకారం చుడితే.. మనం అనుకున్నట్టు ఫలితాలు ఉంటాయి, విద్యారంగంలో ఇంకా మెరుగ్గా ఎలా చేయగలుగుతాం అన్నదానిపై ఆలోచనలు చేయాలి. నలుగురితో నేను మాట్లాడి… నాకు అనిపించిన ఆలోచనలన్నింటినీ కూడా వీసీల ముందు ఉంచుతున్నాను. ఈ ఆలోచనలు కార్యాచరణలోకి రావాలి, వీటికి రూపకల్పన జరగాలి. ఇందులో మీ పాత్ర గరిష్టంగా ఉండాలి. ఈ రోజు మనం మొట్టమొదటి అడుగు వేస్తున్నాం. ఈ తొలి అడుగు మన ఆలోచనలను చైతన్యం చేయడం ద్వారా విద్యారంగాన్ని ఇప్పుడున్న స్థాయి నుంచి మెరుగైన స్థాయికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది.

ప్రపంచస్థాయిలో మన పిల్లలను అనేక రంగాల్లో లీడర్లుగా చూడాలనుకుంటున్నాం. ఇవాళ మనం చదివిస్తున్న, చదువుకుంటున్న చదువులు నిజంగానే.. ప్రపంచస్థాయిలో నాయకులుగా నిలబడగలిగే స్థాయిలో ఉన్నాయా? లేకపోతే… ఎలా చేయాలన్న దానిపై ఆలోచనలు చేయాల్సిన అవసరం ఉందన్నారు సీఎం జగన్.. మనం కొన్ని సబ్జెక్టులను నిర్దేశిస్తున్నాం. ఒకసారి వెస్ట్రన్‌ కరిక్యులమ్‌ చూస్తే.. వెస్ట్రన్‌ వరల్డ్‌లో… ఒక ఫ్యాకల్టీని తీసుకుంటే.. చాలా వర్టికల్స్‌ కనిపిస్తాయి. ఒక బీకాంలోనే అసెట్‌ మేనేజ్‌మెంట్, ఫైనాన్సియల్‌ మార్కెట్, రిస్క్‌ మేనేజ్‌మెంట్, సెక్యూరిటీ అనాలసిస్‌ ఇలాంటి వర్టికల్స్‌ ఎన్నో ఉన్నాయి. మన దగ్గర లేవు. మంచి డిగ్రీ రావాలంటే విదేశాలకు పోవాల్సిందే. మనం కూడా చదువుకునే విద్యార్థులకు మరిన్ని ఆప్షన్లు ఇవ్వాలి. వారు కావాల్సిన వర్టికల్స్‌ చదువుకునే అవకాశాలను ఇవ్వాలి. మనం డిగ్రీలకు సంబంధించి తాజాగా క్రెడిట్స్‌ఇస్తున్నాం.. కాని, వాటి స్థాయిని కూడా పెంచాల్సి ఉంది. పిల్లలకు కావాల్సిన కోర్సుల్లో బోధన అందించాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా చేయడానికి ప్రతి ఫ్యాకల్టీలో మనం క్రియేట్‌ చేయగలగాలి. దీనిపై ప్రతి వీసీ కూడా ఆలోచన చేయాలన్నారు. ఇవేకాకుండా రకరకాల అంశాల్లో అడుగులు పడాల్సి ఉంది. మనం ఇచ్చే డిగ్రీలకు సంబంధించి కూడా మార్పులు రావాల్సి ఉంది. ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేసి, ఉద్యోగాల కల్పన దిశగా అడుగులేశాం. ఇది కూడా చాలా ముఖ్యమైన విషయంగా పేర్కొన్నారు.

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ను పూర్తిగా వినియోగించుకోవాలి. సెక్యూరిటీ అనాలసిస్, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ వంటి వర్టికల్‌ కోర్సులకు సంబంధించి బోధన చేసే స్థాయిలో మనం ఉన్నామా? లేదా? అన్నదికూడా చూడాలి. ఒకవేళ లేకపోతే… అలాంటి కోర్సులు కావాలనుకునే విద్యార్థులకు బోధనను నిలిపేస్తామా? అంటే నిలిపివేయలేం. వర్చువల్‌ రియాలిటీని తీసుకునివచ్చి ఆగ్‌మెంటెడ్‌ రియాలిటీతో కలుపుతాం. ఎప్పుడైతే ఈ రెండూ కలిసాయో… వర్చువల్‌ క్లాస్‌ టీచర్‌ విద్యార్ధులకు పాఠాలు చెబుతారు. ఆ మేరకు తరగతుల నిర్వహణ ఉండాలని స్పష్టం చేశారు సీఎం జగన్‌.. మెడికల్‌ కోర్సుల బోధనలో కూడా మార్పులు గణనీయంగా రావాల్సి ఉంది. 5 ఏళ్ల మెడికల్‌ కోర్సు రాబోయే రోజుల్లో ఇవాళ సాంకేతిక పరిజ్ఞానానికి తగినట్టుగా కూడా మార్పులు రావాలి. శరీరాన్ని కోసి ఆపరేషన్‌ చేసే రోజులు పోయాయి. కేవలం కొన్ని హోల్స్‌ చేసి.. కంప్యూటర్ల ద్వారా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ను వాడకుని ఆపరేషన్‌ చేసే స్థాయి వచ్చింది. అందుకే వైద్యులకు రోబోటిక్స్, ఏఐలను పాఠ్యప్రణాళికలో, బోధనలో భాగస్వామ్యం చేయాలన్నారు.