Site icon NTV Telugu

Kathanar : అనుష్క లేటెస్ట్ సినిమా ‘కథనార్’ ట్రైలర్ రిలీజ్

Kathanaar

Kathanaar

మలయాళ ఇండస్ట్రీ ఇటీవల కాలంలో విభిన్నమైన కథలతో మంచి గుర్తింపు తెచ్చుకుంటోంది. ఇప్పుడు అదే బాటలో కథనార్అనే మరొక భారీ బడ్జెట్ సినిమాను తీసుకువస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసారు మేకర్స్. విడుదలైన ట్రైలర్ చూస్తుంటే, ఇది రొటీన్ చిత్రాలకు భిన్నంగా, ఒక సరికొత్త ఫాంటసీ ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకెళ్లేలా ఉంది.

ట్రైలర్ ప్రారంభం నుండే ప్రేక్షకులను తన వైపు తిప్పుకునేలా డార్క్ మరియు రిచ్ విజువల్స్‌తో డిజైన్ చేశారు. చాలా సహజంగా ఉన్న సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఆ కల్పిత ప్రపంచాన్ని సృష్టించడానికి చిత్ర యూనిట్ పడిన కష్టం ప్రతి ఫ్రేమ్‌లోనూ స్పష్టంగా కనిపిస్తోంది. సినిమాటోగ్రాఫర్ పనితనం ఈ మిస్టరీ కథకు ప్రాణం పోసిందని చెప్పవచ్చు. భారతీయ సినిమాల్లో వీఎఫెక్స్ విషయంలో తరచుగా విమర్శలు వస్తుంటాయి, కానీ ‘కథనార్’ ఆ విషయంలో ఆశ్చర్యపరిచింది. ఇందులోని సీజీఐ వర్క్ చాలా క్లీన్‌గా మరియు సహజంగా ఉంది. ఎక్కడా గ్రాఫిక్స్ అతిగా ఉన్నాయనే భావన కలగకుండా కథలో లీనమయ్యేలా ఉన్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ఆ మిస్టరీని మరియు ఉత్కంఠను రెట్టింపు చేసేలా సరిగ్గా సరిపోయింది. ‘కథనార్’ కథాంశం చాలా ఫ్రెష్‌గా ఉంది. ఇది ఒక రొటీన్ మాంత్రికుడి కథలా కాకుండా  వైవిధ్యమైన స్క్రీన్ ప్లేతో సాగేలా కనిపిస్తోంది. భారతీయ జానపద కథలను ఆధునిక సాంకేతికతతో జోడించి మలయాళ మేకర్స్ చేస్తున్న ఈ ప్రయత్నం నిజంగా అభినందనీయం. జయసూర్య సరసన అనుష్క శెట్టి కీలక పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లోనూ ఆసక్తి నెలకొంది.

Exit mobile version