Anurag Thakur About Solar Photovoltaic
భారతదేశంలో సోలార్ ఫోటోవోల్టాయిక్ (పీవీ) మాడ్యూల్స్ తయారీని పెంచడానికి పెర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్‌ఐ) పథకం రెండవ విడతకు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ విలేకరుల సమావేశంలో ప్రకటించారు. పీఎల్‌ఐ పథకం రెండవ విడతతో ప్రభుత్వం ఏడాదికి సుమారు 65GW తయారీ సామర్థ్యంతో పూర్తిగా, పాక్షికంగా ఏకీకృత, సోలార్ పీవీ మాడ్యూల్స్‌ను దేశంలో ఏర్పాటు చేయాలని భావిస్తోంది. “అధిక సామర్థ్యం గల సోలార్ పీవీ మాడ్యూల్స్‌పై జాతీయ కార్యక్రమం కోసం పీఎల్‌ఐ పథకం రెండవ విడత రూ.19,500 కోట్లతో ఆమోదించబడింది. దీని ద్వారా భారతదేశంలోని సోలార్ పీవీ మాడ్యూల్స్‌లో గిగా వాట్ (GW) స్కేల్ తయారీ సామర్థ్యాన్ని సాధించడం, తద్వారా పునరుత్పాదక శక్తి రంగంలో దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడంపై మేము చూస్తున్నాము. ఇది ప్రభుత్వ ఆత్మనిర్భర్ భారత్ చొరవను బలోపేతం చేస్తుంది మరియు ఉపాధిని సృష్టిస్తుంది, ”అని ఆయన అన్నారు.
ప్రస్తుతం భారతదేశంలో సోలార్ ఎనర్జీ సెక్టార్‌లోని అన్ని తయారీ కేవలం సెల్‌లు, మాడ్యూల్స్‌కు మాత్రమే పరిమితమైంది. ప్రస్తుతం భారతదేశంలో సోలార్ వేఫర్‌లు, పాలీసిలికాన్‌ల తయారీ లేదు. ఈ పథకం ద్వారా, ప్రభుత్వం మూడు కేటగిరీల్లో సోలార్ విడిభాగాల తయారీ కోరుతోంది. ఇందులో ఎక్కువ భాగం ఇంటిగ్రేటెడ్ యూనిట్‌లను ఉత్పత్తి చేయడంపై దృష్టి పెడుతుంది. మిగిలిన రెండింటిని వేఫర్‌లు-పాలిసిలికాన్ మరియు సెల్-మాడ్యూల్స్ మధ్య సమానంగా విభజించారు.