Anti Suicide Fans: ఫ్యాన్‌కు ఉరేసుకుంటే కిందపడిపోతారు.. ఆత్మహత్యల నివారణకు గుజరాత్ వర్సిటీ మాస్టర్ ప్లాన్..

Anti Suicide

Anti Suicide

గుజరాత్‌లోని వీర్ నర్మద్ సౌత్ గుజరాత్ యూనివర్సిటీ (VNSGU) తమ హాస్టల్ గదుల్లో విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు ఒక కొత్త భద్రతా చర్యను చేపట్టింది. హాస్టళ్లలో ఉరివేసుకొని బలవన్మరణాలకు పాల్పడే ఘటనలను అరికట్టడానికి విశ్వవిద్యాలయ యాజమాన్యం మొత్తం 354 ప్రత్యేక ‘యాంటీ సూసైడ్’ ఫ్యాన్లను అమర్చింది. రూ.1,500 వ్యయంతో రూపొందించిన ఈ ఫ్యాన్లలో ప్రత్యేక స్ప్రింగ్ మెకానిజమ్ ఉంటుంది. ఫ్యాన్‌పై సుమారు 10 కిలోల కంటే ఎక్కువ బరువు లేదా ఒత్తిడి పడిన వెంటనే, అందులోని స్ప్రింగ్ ఊడిపోయి ఫ్యాన్ కిందకు దిగుతుంది.. అంతే కాకుండా దానికి ఉండే విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. దీనివల్ల ఫ్యాన్ మనిషి బరువును మోయలేక ఆత్మహత్య ప్రయత్నం విఫలమవుతుంది. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ కిషోర్‌సింగ్ చావ్డా హాస్టల్ గదిలో దుప్పటి సహాయంతో ఈ విధానాన్ని స్వయంగా ప్రాక్టికల్‌గా పరీక్షించి చూపించారు.

దేశంలో విద్యార్థులపై పెరుగుతున్న చదువుల ఒత్తిడి, మానసిక ఆందోళనల దృష్ట్యా ఈ నివారణ చర్య ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ చర్యపై సోషల్ మీడియాలో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫ్యాన్లను మార్చడం వల్ల మాత్రమే సమస్య తీరదని, అసలైన కారణమైన విద్యార్థుల మానసిక ఒత్తిడిని తగ్గించి వారికి కౌన్సెలింగ్, అవసరమైన మానసిక మద్దతు అందించడమే నిజమైన పరిష్కారమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. భౌతిక భద్రతా చర్యలతో పాటు విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకునే వాతావరణం క్యాంపస్‌లలో ఏర్పడాలని విశ్లేషకులు భావిస్తున్నారు.