Site icon NTV Telugu

Road Accident: అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 9కి చేరిన మృతుల సంఖ్య!

Pullampeta Road Accident

Pullampeta Road Accident

అన్నమయ్య జిల్లాలో ఆదివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 9కి చేరింది. ప్రమాదంలో ఐదు మంది మహిళలు, నలుగురు పురుషులు మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. నేడు తొమ్మిది మంది మృతదేహాలకు రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించనున్నారు. మృతులు అందరూ రైల్వే కోడూరు మండలం సెట్టిగుంట ఎస్టీ కాలనీ చెందిన వారిగా గుర్తించారు. అతివేగమే ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు.

రాజంపేట నుంచి రైల్వేకోడూరు మార్కెట్‌కు మామిడికాయల లోడుతో వెళ్తున్న లారీ.. ఆదివారం రాత్రి పుల్లంపేట మండలం రెడ్డిపల్లి చెరువు కట్టపై బోల్తా పడింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. ప్రమాద సమయంలో డ్రైవర్‌తో పాటు ఇద్దరు చిన్న పిల్లలతో కలిపి లారీలో 21 మంది కూలీలు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టి 9 మందిని రక్షించారు.

Also Read: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?

ఈ రోడ్డు ప్రమాద ఘటనపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పందించారు. ‘లారీ బోల్తా పడి 9 మంది మృతి చెందడం బాధాకరం. మామిడికాయలు కోసే కూలీల మరణ వార్త దిగ్బ్రాంతికి గురి చేసింది. కూలీల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా’ అని అన్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా సమగ్ర భద్రతా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు చేపట్టి, క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.

 

Exit mobile version