Anil Kumble React on Boundary Length in T20 Cricket: టీ20 ఫార్మాట్ వచ్చాక.. బౌలర్ల ఆధిపత్యం తగ్గిపోయింది. ఎదో ఒక మ్యాచ్‌లో తప్పితే.. బ్యాటర్ల హవానే కొనసాగుతోంది. ఇందుకు మంచి ఉదాహరణే ఐపీఎల్ 2024. ఐపీఎల్ 17వ సీజన్‌లో 200 పైగా స్కోర్లు అలవోకగా నమోదవుతున్నాయి. ఐపీఎల్ 2024లో 287 రన్స్ నమోదవడం విశేషం. భారీ స్కోరుకు బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌లు ఓ కారణం అయితే… బౌండరీ లెంత్ తగ్గించడమూ మరో కారణం. బ్యాటర్ల హవా కొనసాగుతున్న టీ ఫార్మాట్‌లో బౌలర్లు మానసికంగా కుంగిపోకుండా ఉండడానికి చర్యలు చేపట్టాలని మాజీ క్రికెటర్లు సూచనలు చేస్తున్నారు. తాజాగా భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే ఈ విషయంపై స్పందించాడు.
‘ఐపీఎల్ 2024 బౌలర్లకు అత్యంత కష్టంగా మారింది. తొలి భాగంలో బ్యాటర్ల దూకుడు ఎక్కువైంది. అందుకే ప్రతి వేదికలో బౌండరీ లైన్ల పరిధిని పెంచాలి. పెద్ద బౌండరీలు ఉంటే.. బౌలర్లకు వెసులుబాటు ఉంటుంది. అందుకు డగౌట్‌ను స్టాండ్స్‌లోకి మార్చాలి. దానివల్ల కొన్ని సీట్లను నష్టపోవచ్చు కానీ.. బౌలర్ల విషయంలో చాలా మెరుగుపడేందుకు అవకాశం ఉంటుంది. తొలి ఓవర్‌లోనే బంతి బాగా స్వింగ్ అవుతోంది. ఆ తర్వాత బ్యాటర్లదే హవా. అందుకే బ్యాటింగ్, బౌలింగ్ మధ్య సమతూకం చేయాల్సిన అవసరం ఉంది’ అని అన్నారు.
Also Read: Private Jet Villa: విలాసవంతమైన విల్లాగా విమానం.. వీడియో వైరల్!
‘బ్యాటర్ల హవా ఇలానే కొనసాగితే రాబోయే సంవత్సరాల్లోనే కుర్రాళ్లెవరూ బౌలింగ్‌ను కెరీర్‌గా మలుచుకోరు. ప్రతి ఒక్కరూ బ్యాటర్ అవ్వాలనే అనుకుంటాడు. మ్యాచ్‌లో బౌలర్లనూ భాగం చేయాల్సిందే. తప్పకుండా ఈ సమస్యను పరిష్కరిస్తారని నేను అనుకుంటున్నా. స్ట్రైయిట్ బౌండరీ కనీసం 64 మీటర్లు (70 గజాలు) ఉండాలి. చుట్టూ 77 మీటర్లు (85 గజాలు) కంటే ఎక్కువ లేకుండా చూడాలి. మైదానం మధ్య నుంచి సమానంగా బౌండరీ లైన్లు ఏర్పాటు చేయాలి’ అని అనిల్ కుంబ్లే సూచించారు.
