Anaparthi Kidnapping Case: ఐదేళ్ల బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం.. 15 రోజుల తర్వాత తల్లిదండ్రుల ఒడికి చిన్నారి!

Anaparthi Kidnapping Case

Anaparthi Kidnapping Case

5-Year-Old Boy Rescued After 15 Days in Anaparthi: ఐదేళ్ల బాలుడి కిడ్నాప్ కేసును ఛేదించి చిన్నారిని సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు చేర్చారు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి పోలీసులు. ఆర్థిక అవసరాల కోసం బాలుడిని కిడ్నాప్ చేసి విక్రయించేందుకు ముగ్గురు నిందితులు కుట్ర పన్నారు. గత నెల 23న పొలానికి వెళ్లిన తల్లిదండ్రులు తిరిగి వచ్చేసరికి ఐదేళ్ల కృష్ణ కనిపించకుండా పోయాడు. దాంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. తొలుత ఐదు బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. వర్షాలు, తుఫానుల కారణంగా సీసీ కెమెరాల ఫుటేజ్ స్పష్టంగా లేకపోయినా.. సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేపట్టారు.

ఆటోలు, బస్సుల మార్గాలను అనుసరిస్తూ నిందితుల కదలికలను పోలీసులు గుర్తించారు. దుండగులు పిఠాపురంలో బాలుడిని దాచిపెట్టి హైదరాబాద్‌కు తరలించి విక్రయించేందుకు ప్రయత్నం చేశారు. 10 ప్రత్యేక పోలీసు బృందాలతో 15 రోజుల పాటు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. పక్కా సమాచారంతో దాడి చేసి బాలుడిని రక్షించిన పోలీసులు.. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ మేరకు కేసు వివరాలను రాజమహేంద్రవరం ఈస్ట్ జోన్ డీఎస్పీ బి.విద్య, సీఐ సుమంత్ వెల్లడించారు. కేసును ఛేదించిన సీఐ సుమంత్, ఎస్సై వినయ్ ప్రతాప్, పోలీసు బృందాన్ని డీఎస్పీ అభినందించారు. పిల్లల అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 15 రోజుల తర్వాత బిడ్డను చూసి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేశారు.