AP Handicrafts Global Recognition: ఆంధ్రప్రదేశ్ హస్తకళలకు అంతర్జాతీయ వేదికపై మరోసారి ఘనమైన గుర్తింపు లభించిందని రాష్ట్ర మంత్రి సవిత హర్షం వ్యక్తం చేశారు. సింగపూర్‌లో నిర్వహించనున్న భారత్ రిపబ్లిక్ డే వేడుకల్లో ఏపీ హస్తకళలతో రూపొందించిన ప్రత్యేక గిఫ్ట్ బాక్స్‌లను అందజేయాలని భారత్ హై కమిషన్ నిర్ణయించడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు. సింగపూర్‌లోని భారత్ హై కమిషనర్, మొత్తం 400 ప్రత్యేక గిఫ్ట్ బాక్స్‌ల తయారీకి ఏపీ ప్రభుత్వ సంస్థ లేపాక్షికి ఆర్డర్ ఇచ్చారు. ఈ గిఫ్ట్ బాక్స్‌లలో సీతాదేవి లెదర్ పప్పెట్రీ, ఏనుగు ఆకారపు బ్యాగేజ్ ట్యాగ్, హ్యాండ్ పెయింటెడ్ ఏనుగు కోస్టర్ వంటి సంప్రదాయ కళారూపాలను పొందుపరిచారు. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ హస్తకళల ప్రత్యేకతను ప్రపంచానికి చాటేలా రూపొందించబడ్డాయి అని వెల్లడించారు.
Read Also: Vidya Balan- Kiara: విద్యాబాలన్, కియారా అద్వానీ పై నెటిజన్ల ఫైర్..
ఏపీ హస్తకళలకు ప్రపంచ స్థాయి గుర్తింపు రావడం ఆనందంగా ఉందని మంత్రి సవిత తెలిపారు. గతేడాది ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో ఏపీ హస్తకళల శకటానికి లభించిన ప్రశంసలతో రాష్ట్ర కళారూపాలకు మరింత ప్రాచుర్యం వచ్చిందని గుర్తు చేశారు. హస్తకళలకు, కళాకారులకు వెన్నుదన్నుగా నిలిచిన కూటమి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని మంత్రి వెల్లడించారు. సంప్రదాయ కళారూపాలకు ఆధునిక హంగులు జోడించేలా కళాకారులకు ప్రత్యేక శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. అలాగే లేపాక్షి షోరూమ్‌ల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఇక, విశాఖపట్నం, అనంతపురం, కడప సహా రాష్ట్రంలోని ప్రధాన కేంద్రాల్లో ఉన్న 15 లేపాక్షి షోరూమ్‌లను ఆధునీకరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. భవిష్యత్తులో ఇతర దేశాల్లోనూ లేపాక్షి షోరూమ్‌ల ఏర్పాటు కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని మంత్రి సవిత తెలిపారు. ఆంధ్రప్రదేశ్ హస్తకళలను ప్రపంచ స్థాయిలో నిలబెట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు మంత్రి సవిత.
