NTV Telugu Site icon

CM YS Jagan: అబద్దాలన్నీ నమ్మకండి.. మంచి జరిగిందా అనేదే ప్రామాణికంగా తీసుకోండి..

Cm Jagan

Cm Jagan

CM YS Jagan: అబద్దాలన్నీ నమ్మకండి.. మీ ఇంట్లో మీకు మంచి జరిగిందా అనేది ఒక్కటే ప్రామాణికంగా తీసుకోండి.. మంచి జరిగుంటే మీ బిడ్డకు మీరే సైనికులుగా మారండి అని విజ్ఞప్తి చేశారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. గుడివాడ మున్సిపాల్టీ పరిధిలోని మల్లాయపాలెంలో 77 ఎకరాల లేఅవుట్‌లో పూర్తయిన 8,912 టిడ్కో ఇళ్లను ప్రారంభించిన సీఎం వైఎస్‌ జగన్‌.. పట్టాలు పంపిణీ చేశారు.. ఇక, ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ.. టిడ్కో ఇళ్ల ద్వారా అక్కచెల్లెమ్మల కుటుంబాలకు ప్రభుత్వం 16,601 కోట్లు ఖర్చు భరిస్తోంది. ఇది వాస్తవం అయితే, ఇందులో చంద్రబాబు చేసింది ఏమిటి? గుమాస్తాగిరీ పని కూడా సరిగ్గా చేయలేదు.. తాను చేయని పనులు చేసినట్లుగా ప్రచారం చేసుకోవడం తప్ప చేసిందేమిటి? అంటూ ఫైర్‌ అయ్యారు. నాలుగేళ్లలో మనందరి ప్రభుత్వం ఇన్ని లక్షల ఇళ్లు ఎలా కట్టగలిగింది. ఆలోచన చేయాలి. మరి ఇదే పనిని 30 ఏళ్ల క్రితమే సీఎం అయిన ఈ బాబు ఎందుకు చేయలేకపోయాడు. ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి.. బాబు పేదల వ్యతిరేకి కాబట్టి చేయలేదని వ్యాఖ్యానించారు.

అమరావతిలో పేదలకు ఇళ్లపట్టాలిస్తే అక్కడ డెమోగ్రఫిక్ ఇంబ్యాలన్స్ వస్తుందని ఏకంగా కోర్టుల్లో కూడా నిస్సిగ్గుగా వాదించారు. అదే, అమరావతిలో 50 వేల మంది అక్కచెల్లెమ్మలకు సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాడి ఇళ్ల స్థలాలు ఇచ్చాం. ఇదే పనిని ఈ బాబు ఎందుకు చేయలేదని ఆలోచన చేయాలని కోరారు.. 4 సంవత్సరాల కాలంలో 2.16 లక్షల కోట్లు నేరుగా బటన్ నొక్కి లంచాలు, వివక్ష లేకుండా నేరుగా వెళ్తున్నాయి. 4 ఏళ్లలో అవ్వాతాతలు, వితంతువులు, వికలాంగులకు పింఛన్ రూపంలో 72 వేల కోట్లు అవ్వాతాతలకు ఇవ్వగలిగాం. రైతు భరోసాగా అందించిన సొమ్ము 31 వేల కోట్లు ఇవ్వగలిగాం.. అమ్మ ఒడిగా అక్కచెల్లెమ్మలకు పిల్లల బాగోగుల కోసం 19,674 కోట్లు. ఆసరాగా అక్కచెల్లెమ్మలు వాళ్ల కాళ్లమీద నిలబడాలని 4 ఏళ్లలో 19,178 కోట్లు, చేయూతగా నా అక్కచెల్లెమ్మలకు తోడుగా నిలబడేందుకు 4 ఏళ్లలో 14,129 కోట్లు, అక్కచెల్లెమ్మల పిల్లలు చదవాలి, ఎదగాలని విద్యాదీవె, వసతి దీవెన కింద 14,913 కోట్లు ఇవ్వగలిగాం. మరి ఇవన్నీ 30 ఏళ్ల క్రితమే సీఎం అయిన ఈ బాబు, 14 సంవత్సరాలు సీఎం కుర్చీలో కూర్చున్నఈ బాబు, 3 సార్లు సీఎం అయిన ఈ బాబు ఎందుకు చేయలేదంటూ ప్రశ్నలు సంధించారు.

రాష్ట్రంలో పేదలకు ఇళ్లు కట్టే ఉద్దేశం చంద్రబాబుకు ఎలాగూ లేదు.. ఎన్నికలు దగ్గరకొచ్చేసరికి చంద్రబాబు కుప్పంలో ఈరోజు ఇళ్లు కట్టుకుంటానని పర్మిషన్ కోసం నన్ను అడుగుతున్నాడు అని ఎద్దేవా చేశారు సీఎం జగన్‌.. కుప్పంలో మైకు పట్టుకొని ఇంకో చాన్స్ ఇవ్వండి చేసేస్తాం అంటాడు. సీఎంగా ఉన్న ఆరోజుల్లో మీ ప్రతి ఇంటికీ ఈ మంచి నేను చేశాను కాబట్టి నాకు ఓటేయండని అడగలేడు. ఎన్నికలకు ముందు ఇచ్చిన మేనిఫెస్టోను ఒక ఖురాన్, భగవద్గీత, బైబిల్ గా భావిస్తా. 99 శాతం నెరవేర్చి ప్రతి అక్కచెల్లెమ్మల వద్దకు వెళ్లి మీకు మంచి జరిగిందా అనే నైతికత మనది. ప్రతిసారీ ముఖ్యమంత్రి అయిన తర్వాత మేనిఫెస్టో చెత్తబుట్టకే పరిమితం చేశాడు ఆ పెద్దమనిషిదని సెటైర్లు వేశారు. రెండు పక్కలా రెండు పార్టీలు ఉంటే తప్ప నిలబడలేని బాబు మనకు ప్రత్యర్థి అట. 175 నియోజకవర్గాల్లో క్యాండేట్లను పెట్టలేని వ్యక్తి మనకు ప్రత్యర్థట. తాను ఎమ్మెల్యే అవుతానని, ఎవరు ఆపుతారో చూస్తానని అంటున్న దత్తపుత్రుడు మరో వంక అంటూ విపక్షాలపై విమర్శలు కురపించారు సీఎం వైఎస్‌ జగన్.