Anaya Bangar: క్రికెట్‌లోకి తిరిగి రావడానికి సిద్ధమవుతున్న అనయా బంగర్.. దక్షిణాఫ్రికా స్టార్ ఆల్‌రౌండర్ మారిజానే కాప్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించింది. మహిళల క్రికెట్‌లోకి అనయాకు తిరిగి వచ్చే అవకాశం కల్పించడంపై కాప్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. క్రికెట్ ఆస్ట్రేలియా తీసుకున్న నిర్ణయాన్ని కాప్ ‘పూర్తిగా హాస్యాస్పదం’ అంటూ విమర్శించింది. తాజాగా ఆమె వ్యాఖ్యలపై అనయా బంగర్ స్పందిస్తూ.. ఈ అంశంపై వ్యతిరేకంగా మాట్లాడేవారు ముందుగా పూర్తి వివరాలు తెలుసుకోవాలని సూచించింది.
మారిజానే కాప్ వ్యాఖ్యల గురించి అనయా బంగర్ స్పష్టంగా స్పందించింది. తనకు అనుచిత ప్రయోజనం ఏమీ లేదని, క్రికెట్ ఆస్ట్రేలియా నిర్దేశించిన మార్గదర్శకాలను తాను పాటిస్తున్నానని తెలిపింది. ఈ అంశంపై విమర్శలు చేసే వారు ముందుగా సంబంధిత విషయాలను పూర్తిగా అర్థం చేసుకోవాలని అనయా పేర్కొంది. తన అర్హతకు సంబంధించిన అవసరమైన సమాచారాన్ని ఇప్పటికే అందుబాటులో ఉంచానని, అయినప్పటికీ ఎవరికైనా వ్యక్తిగత అభిప్రాయం భిన్నంగా ఉంటే.. ఈ అంశంపై మరింత అవగాహన పెంచుకోవాలని సూచించింది.
క్రికెట్ ఆస్ట్రేలియా అనుమతి లభించడంతో అనయా బంగర్‌కు క్రికెట్‌లోకి తిరిగి వచ్చే మార్గం సుగమమైంది. అయితే దీనిని నేరుగా ప్రొఫెషనల్ జట్టులో చోటు దక్కినట్లు భావించకూడదు. ప్రస్తుతం ఆమె ఆస్ట్రేలియాలోని ఏదైనా రాష్ట్రం లేదా టెరిటరీలో ప్రీమియర్ క్రికెట్ ఆడేందుకు అర్హత పొందింది. ఇప్పటికే కొన్ని స్థానిక క్లబ్‌లతో అనయా చర్చలు జరుపుతున్నట్లు sసమాచారం. త్వరలో తనకు సరైన జట్టును ఎంపిక చేసుకుని క్లబ్ క్రికెట్‌లో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. భవిష్యత్తులో ఉమెన్స్ బిగ్ బ్యాష్ లీగ్ (WBBL)లో ఆడటమే తన ప్రధాన లక్ష్యమని అనయా వెల్లడించింది. అయితే WBBLలో చోటు దక్కాలంటే ముందుగా క్లబ్ క్రికెట్‌లో మంచి ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. ఫిట్‌నెస్‌ను తిరిగి సాధించడంతో పాటు తన ఆటతో సెలెక్టర్లను ఆకట్టుకోవాల్సి ఉంటుంది.
క్రికెట్ ఆస్ట్రేలియా తీసుకున్న నిర్ణయం సాధారణమైన లేదా అనధికారిక ప్రక్రియ కాదని అనయా స్పష్టం చేసింది. తన కేసులో బోర్డు అనేక అంశాలను పరిశీలించినట్లు తెలిపింది. తన మెడికల్, సర్జికల్ హిస్టరీ, హార్మోన్, టెస్టోస్టెరాన్ రిపోర్టులు, క్రికెట్ నేపథ్యం, మ్యాచ్ ఫుటేజ్ వంటి వివరాలను పరిశీలించినట్లు పేర్కొంది. అలాగే మాంచెస్టర్ మెట్రోపాలిటన్ యూనివర్సిటీకి చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్‌కు సంబంధించిన శాస్త్రీయ, అథ్లెటిక్ పనితీరు సమాచారాన్ని కూడా పరిశీలనలోకి తీసుకున్నట్లు వెల్లడించింది. జూలైలో నిర్వహించిన తన తాజా రక్త పరీక్షలో మొత్తం టెస్టోస్టెరాన్ స్థాయి 0.6 నానోమోల్/లీటర్ గా నమోదైనట్లు అనయా తెలిపింది.
అనయా బంగర్ ఎలైట్ క్రికెట్‌లోకి తిరిగి రావడానికి సంబంధించిన అర్హత మార్చి 2027 నుంచి అమల్లోకి రానున్న విధాన నిబంధనలపై ఆధారపడి ఉంటుంది. అప్పటివరకు ఆమె కమ్యూనిటీ లేదా ప్రీమియర్ క్రికెట్‌లో కొనసాగవచ్చు. అందువల్ల క్రికెట్ ఆస్ట్రేలియా అనుమతిని WBBL కాంట్రాక్ట్ లేదా జాతీయ/ప్రొఫెషనల్ జట్టులో ఎంపికగా భావించలేము. ముందుగా ఫిట్‌నెస్‌ను తిరిగి సాధించి, క్లబ్ క్రికెట్‌లో రాణించి, ఆ తర్వాత ఉన్నత స్థాయి ఎంపిక కోసం తనను తాను నిరూపించుకోవాల్సి ఉంటుంది.
మరోవైపు తన ప్రయాణం గురించి కూడా అనయా బంగర్ కీలక వ్యాఖ్యలు చేసింది. చాలా కాలం పాటు తాను ‘సర్వైవల్ మోడ్’లో ఉన్నానని తెలిపింది. గతంలో ఎదురైన పరిణామాలను ఇప్పుడు నెమ్మదిగా అర్థం చేసుకుంటూ, తన జీవితాన్ని తిరిగి సర్దుబాటు చేసుకునే దశలో ఉన్నానని పేర్కొంది. తన ముందున్న ప్రయాణాన్ని చిన్న చిన్న అడుగులతో ప్రారంభించనున్నట్లు అనయా తెలిపింది.
VIDEO | Delhi: Trans-athlete Anaya Bangar's inclusion in the Community Shield, which is quite literally an entry-level competition in Australia, has evoked reactions on both ends of the spectrum.
There has been empathy but criticism too, like South Africa great Marizanne Kapp's… pic.twitter.com/L5Wo2ki3nj
— Press Trust of India (@PTI_News) August 28, 2026

