NTV Telugu Site icon

Anand Mahindra: సానియా మీర్జా నాకు స్ఫూర్తి: ఆనంద్ మహీంద్ర ట్వీట్ వైరల్

Anan

Anan

భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా కెరీర్‌ ఎన్నో ఒడిదొడుకుల మధ్య సాగింది. ఇటీవలే ఆస్ట్రేలియా ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్‌ ఫైనల్ వరకు వెళ్లి ఓటమితో సరిపెట్టుకుంది. ఈ నేపథ్యంలోనే ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర.. సానియా కెరీర్‌ తనకెంతో స్ఫూర్తి అని చెప్పారు. సోషల్ మీడియాలో ఎంతో చురుగ్గా ఉండే ఆయన.. వారాన్ని ఉత్సాహంగా మొదలుపెట్టేందుకు ప్రతి సోమవారం స్ఫూర్తిదాయక సందేశాలను పంచుకుంటారు. ఈ రోజు కూడా ఆయన ఓ మండే మోటివేషన్‌ షేర్‌ చేశారు. మరి ఈరోజు ఆయన ప్రేరణ పొందింది ఎవరి నుంచో తెలుసా? మన టెన్నిస్ స్టార్‌ సానియా మీర్జా నుంచే. సానియా కెరీర్‌ తనలో కొత్త స్ఫూర్తిని రగిలించిందని మహీంద్రా నేడు ట్వీట్‌ చేశారు.

Also Read: Pre release: వెండితెర ‘ఐపీఎల్’కు రంగం సిద్థం!

టెన్నిస్‌ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించిన సానియా మీర్జా గత నెల తన చివరి గ్రాండ్‌స్లామ్‌ ఆడింది. ఆస్ట్రేలియా ఓపెన్‌ టోర్నీలో మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ఫైనల్‌ వరకు వెళ్లి ఓటమితో గ్రాండ్‌స్లామ్‌ కెరీర్‌ను ముగించింది. ఆ మ్యాచ్‌కు ముందు సానియా మాట్లాడుతూ.. “పోటీతత్వం అనేది నా రక్తంలోనే ఉంది. నేను ఎప్పుడు కోర్టులో అడుగుపెట్టినా గెలవాలనే ఆడుతా. అది నా చివరి గ్రాండ్‌స్లామ్‌ అయినా లేదా చివరి సీజన్‌ అయినా సరే..!” అని తెలిపింది. ఈ సందేశాన్ని ఆనంద్‌ మహీంద్రా సోమవారం తన ట్విట్టర్ ఖాతాలో షేర్‌ చేస్తూ.. “ఆమె(సానియా) తన కెరీర్‌ను ఎలా ప్రారంభించిందో అలాగే ముగించింది. విజయం సాధించాలనే పట్టుదల ఆమెలో ఏ మాత్రం తగ్గలేదు. నా కెరీర్‌లో ఈ దశలోనూ రాణించాలనే కోరికను నాలో సజీవంగా ఉంచుకునేలా ఆమె జీవితం గుర్తుచేసింది. ఆమే నా మండే మోటివేషన్‌” అని ఆనంద్ మహీంద్ర ట్వీట్ చేశారు.

36 ఏళ్ల సానియా మీర్జా ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. తన కెరీర్‌లో సానియా మొత్తం 43 డబుల్స్‌ టైటిళ్లు సాధించింది. ఇందులో ఆరు గ్రాండ్‌స్లామ్‌ ట్రోఫీలున్నాయి. మహిళల డబుల్స్‌ కేటగిరీలో 91 వారాల పాటు నంబర్‌ 1 క్రీడాకారిణిగా నిలిచింది. త్వరలో జరగబోయే దుబాయి ఓపెన్‌లో సానియా తన కెరీర్‌లో చివరి టోర్నీ ఆడనుంది.

Show comments