NTV Telugu Site icon

Anand Mahindra : టెస్లా ఇండియాలోకి ఎంట్రీ ఇవ్వడం పై ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే ?

New Project 2025 02 19t172827.391

New Project 2025 02 19t172827.391

Anand Mahindra : మహీంద్రా అండ్ మహీంద్రా ఇటీవలే తన రెండు ఎలక్ట్రిక్ కార్లు XEV 9e, BE 6 లను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ కార్లకు సామాన్యుల నుండి మంచి స్పందన లభిస్తోంది. అలాంటి సమయంలోనే ఎలాన్ మస్క్ టెస్లా భారతదేశానికి వస్తుందన్న వార్తకు కన్ఫాం చేయగానే మహీంద్రా, టాటా వంటి కంపెనీలు ఇప్పుడు ఎలా పోటీ పడతాయని సోషల్ మీడియాలో ప్రజలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఈ ప్రశ్నకు ఆనంద్ మహీంద్రా తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.

ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారన్న విషయం తెలిసిందే. ఆయన ‘X’లో తరచూ క్రియేటివిటీని ప్రోత్సహిస్తారు. ప్రస్తుతం నెటిజన్లు ‘X’ ప్లాట్‌ఫామ్‌పై ఎలోన్ మస్క్‌తో పోటీ గురించి కూడా ఆయనను ప్రశ్నిస్తున్నారు. అలాంటి ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ ఆనంద్ మహీంద్రా ఇలా అన్నారు.. 1991లో ఆర్థిక సంస్కరణల సమయంలో కూడా మమ్మల్ని ఇవే ప్రశ్నలు అడిగారు. టాటా, మారుతీ, మిగతా ఎమ్‌ఎన్‌సీల పోటీని ఎలా తట్టుకుంటారని ప్రశ్నించారు. కానీ మేమిప్పటికీ మార్కెట్లో నిలిచే ఉన్నాము. మరో వందేళ్ల పాటు కొనసాగేలా ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నాము. మీరిచ్చే ప్రోత్సాహంతో దీన్ని సాధ్యం చేసి చూపుతాము’’ అని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.

ఆనంద్ మహీంద్ర సమాధానం నెటిజన్లకు తెగ నచ్చడంతో ఆయన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఆనంద్ మహీంద్ర ప్రకటనకు మద్దతు ఇస్తూ ఓ నెటిజన్ ఇలా రాశారు.. “దేశ ద్విచక్ర వాహన మార్కెట్లోకి హోండా, యమహా వంటి ప్రపంచ బ్రాండ్లు ప్రవేశించినప్పటికీ, హీరో మోటోకార్ప్, టీవీఎస్, బజాజ్, రాయల్ ఎన్‌ఫీల్డ్ వంటి భారతీయ బ్రాండ్లు ఇప్పటికీ మార్కెట్‌లో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. అదేవిధంగా, టెస్లా భారతదేశానికి రావడం ఒక సవాలు కాదు,.. బదులుగా ఇది మార్కెట్లో ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుంది.. దానిని బలోపేతం చేస్తుంది. ఇది దేశంలో ఎలక్ట్రిక్ వాహన పర్యావరణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.’’ అంటూ చెప్పుకొచ్చాడు.

ఎలోన్ మస్క్ టెస్లా భారతదేశానికి వస్తుందని దాదాపుగా ఖరారు అయింది. ఆ కంపెనీ ఢిల్లీ, ముంబైలలో తన షోరూంలను ప్రారంభించబోతోంది. దీని కార్లు ఏప్రిల్ 2025 నుండి ఇక్కడ అందుబాటులో ఉంటాయి. దీని ప్రారంభ ధర రూ. 22 లక్షలుగా ఉండవచ్చని తెలుస్తోంది.