Death Threat: బిగ్ బీ కుటుంబానికి మరో బిగ్ వార్నింగ్.. అమితాబ్, అభిషేక్‌లను టార్గెట్ చేశామంటూ గ్యాంగ్‌స్టర్ సంచలనం.!

Amitabh Bachchan

Amitabh Bachchan

Amitabh Bachchan Death Threat: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కుటుంబానికి వరుసగా వస్తున్న గ్యాంగ్‌స్టర్ బెదిరింపులు సినీ పరిశ్రమలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే ఒక గ్యాంగ్ అమితాబ్‌ను టార్గెట్ చేసినట్లు ప్రకటించగా, తాజాగా మరో గ్యాంగ్‌స్టర్ అమితాబ్‌తో పాటు ఆయన తనయుడు అభిషేక్ బచ్చన్‌పైనా గురిపెట్టినట్లు హెచ్చరించడం బాలీవుడ్‌ను షేక్ చేస్తోంది. అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్‌లను అంతమొందిస్తామంటూ గ్యాంగ్‌స్టర్ గోల్డీ ధిల్లాన్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ సంచలనంగా మారింది. వారిద్దరినీ లక్ష్యంగా చేసుకుని ముంబైలో తన అనుచరులు 200 మంది సిద్ధంగా ఉన్నారని అతడు ప్రకటించాడు. అంతేకాకుండా.. ఎన్ని బుల్లెట్ ప్రూఫ్ గాజు అద్దాలు పెట్టుకున్నా, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు వేసుకుని తిరిగినా వారిని కాపాడలేవంటూ, తమ గురి తప్పదంటూ తీవ్ర స్థాయిలో వార్నింగ్ ఇచ్చాడు.

గోల్డీ ధిల్లాన్ పెట్టిన సోషల్ మీడియా పోస్ట్‌పై పోలీసులు వెంటనే అప్రమత్తమై దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇందులో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయన్న దానిపై లోతుగా ఆరా తీస్తున్నారు. ఇటీవల గోల్డీ ధిల్లాన్ గ్యాంగ్‌కు చెందిన ఇద్దరు అనుచరులను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేయగా.. విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముంబైలోని అమితాబ్ నివాసం ‘జల్సా’ వద్ద కాల్పులకు ప్రయత్నించినట్లు ఢిల్లీ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అమితాబ్, అభిషేక్‌లతో పాటు ఢిల్లీకి చెందిన ఒక వ్యాపారిని కూడా ఈ గ్యాంగ్ టార్గెట్ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

ఇప్పటికే లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులతో బాలీవుడ్ సెలబ్రిటీలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. సల్మాన్ ఖాన్‌ను టార్గెట్ చేసిన ఈ ముఠా, ఇప్పుడు మిగతా అగ్రహీరోలపైనా కన్నేసింది. ఆ లిస్టులో అమితాబ్ బచ్చన్ పేరు కూడా వినిపిస్తుండటం గమనార్హం. గతంలో బాంబు బెదిరింపులు రావడంతో, అమితాబ్ తన ఇంటి ముందు ప్రత్యేకంగా బుల్లెట్ ప్రూఫ్ క్యాబిన్ ఏర్పాటు చేసుకుని అభిమానులను పలకరిస్తున్నారు. ఇప్పుడు ఆ క్యాబిన్లను సైతం ఉద్దేశిస్తూ గోల్డీ గ్యాంగ్ హెచ్చరికలు జారీ చేయడంతో బచ్చన్ నివాసం వద్ద భద్రతపై ఆందోళన నెలకొంది.