Amit Shah Visits Bhagyalakshmi Temple: కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్‌కు చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయంలో ఆయనకు బీజేపీ నాయకులు ఘనస్వాగతం పలికారు. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమిత్ షా కు ఆలయ నిర్వాహకులు, పూజారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అమిత్ షా వెంట రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామ చందర్ రావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలతో పాటు పార్టీ శ్రేణులు ఉన్నారు.
భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయ సందర్శన తర్వాత ఆయన హోటల్ ఐటీసీ కాకతీయకు వెళ్లనున్నారు. భోజన విరామం అనంతరం పార్టీ ముఖ్యనేతలతో సమావేశం కానున్నారు. అలాగే సినీ నటులు చిరంజీవి, రామ్ చరణ్‌తో పాటు పారిశ్రామికవేత్త మై హోం రామేశ్వరరావు కూడా అమిత్ షాను కలవనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయమై ఎలాంటి విశ్వసనీయ లేదా అధికారంగా ఎక్కడ తెలుపలేదు.
ఆ తర్వాత సాయంత్రం 4 గంటల తర్వాత నిజాం కళాశాల మైదానం సమీపంలోని బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద నుంచి ప్రారంభమయ్యే మహా పాదయాత్రలో అమిత్ షా పాల్గొననున్నారు. ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్, ఇతర విపక్షాలు చేపట్టిన ర్యాలీకి దీటుగా హైదరాబాద్‌లో అమిత్ షా పర్యటనను భాజపా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఇందుకోసం బీజేపీ పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు.

