కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విజయవాడ పర్యటన నేపథ్యంలో నగర పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. శాంతిభద్రతల పరిరక్షణ, వీవీఐపీ భద్రతను దృష్టిలో ఉంచుకుని నగరంలోని కీలక ప్రాంతాలలో ‘నో ఫ్లైయింగ్ జోన్’అమలు చేస్తున్నట్లు ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమిషనర్ రాజ శేఖర బాబు ప్రకటనలో వెల్లడించారు.
ఈ పర్యటనలో భాగంగా సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబేద్కర్ కళా వేదిక, దాని చుట్టుపక్కల ప్రాంతాలను పోలీసులు పూర్తిగా నిషేధిత పరిధిలోకి తీసుకువచ్చారు. నేడు కేంద్ర హోంమంత్రి పర్యటన పూర్తయ్యే వరకు ఈ ప్రాంతాల్లో ఆంక్షలు కఠినంగా అమల్లో ఉంటాయి. ఈ సమయంలో ఆకాశంలో ఎటువంటి డ్రోన్లు, రిమోట్ కంట్రోల్ మైక్రో-లైట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, పారాగ్లైడర్లు, హాట్ ఎయిర్ బెలూన్లు లేదా ఇతర ఎగిరే వస్తువులను ఎగురవేయడం పూర్తిగా నిషేధించారు.
పోలీసు శాఖ నుంచి ఎటువంటి ముందస్తు అనుమతి లేకుండా ఈ నిబంధనలను అతిక్రమించి డ్రోన్లు లేదా ఇతర ఎగిరే పరికరాలను వినియోగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 223 తో పాటు ఎయిర్‌క్రాఫ్ట్ యాక్ట్ నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. అంతేకాకుండా.. నిబంధనలకు విరుద్ధంగా ఎగురవేసిన పరికరాలను తక్షణమే స్వాధీనం చేసుకుంటామని తెలిపారు.
అత్యంత కీలకమైన కేంద్ర మంత్రి పర్యటన కావడంతో నగర ప్రజలందరూ భద్రతా కారణాలను అర్థం చేసుకుని పోలీసు శాఖకు పూర్తి స్థాయిలో సహకరించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. నిషేధిత ప్రాంతాల్లో ఆంక్షలను గౌరవిస్తూ శాంతిభద్రతల నిర్వహణలో భాగస్వాములు కావాలని నగర వాసులను కోరారు.

