మూడు రోజుల పర్యటనలో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేటి నుంచి జమ్మూకశ్మీర్‌లో పర్యటించనున్నారు. ఇక్కడ పౌరులే టార్గెట్ గా ఉగ్ర దాడులు జరుగుతున్న తరుణంలో పంచాయతీ సభ్యులు, రాజకీయ కార్యకర్తలతో సమావేశమవుతారు. అలాగే, కేంద్ర బలగాలతో సమావేశమై భద్రతపై సమీక్షిస్తారు.ఆగస్టు 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత షా తొలిసారి ఇక్కడ పర్యటిస్తున్నారు. ఈ నెలలో ఇక్కడ జరిగిన దాడుల్లో 11 మంది పౌరులు మరణించారు. ఈ ఘటనలతో సంబంధం ఉన్న 17 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్టుగా జమ్మూకశ్మీర్ పోలీసులు తెలిపారు.
పర్యటనలో భాగంగా షా తొలుత శ్రీనగర్ చేరుకుంటారని, ఆ తర్వాత జమ్ము వెళ్తారు. తిరిగి ఢిల్లీ వెళ్లడానికి ముందు కశ్మీర్‌ను సందర్శిస్తారు. అక్టోబర్ 23 వ తేదీ సాయంత్రం శ్రీనగర్-షార్జా డైరెక్ట్ విమానాన్ని హోంమంత్రి ప్రారంభించే అవకాశం కూడా ఉంది. 24న జమ్మూలో జరిగే బహిరంగ సభలో హోంమంత్రి ప్రసంగిస్తారు.
ఓ పక్క కశ్మీర్ లో బారీ ఎన్ కౌంటర్ జరుగుతోంది. ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమం నడుస్తోంది. ఈ తరుణంలో అమిత్ షా పర్యటన కీలకంగా మారింది. దీంతో జమ్మూ కాశ్మీర్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అదనపు బలగాలను మోహరించారు. కేవలం శ్రీనగర్‌లోనే 20 నుంచి 25 అదనపు కంపెనీల పారామిలటరీ బలగాలను మోహరించారు. అమిత్ షా పర్యటనలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుండా చర్యలు చేపట్టారు.
