Amit Shah: జమ్మూ కశ్మీర్‌ను ఉగ్రవాద రహిత ప్రాంతంగా మార్చడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టంగా ముందుకు సాగుతోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఉగ్రవాదుల స్థావరాలు, వారి ఆర్థిక వనరులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఆపరేషన్లపై షా ఆరా తీశారు. ఎలాంటి సడలింపులు లేకుండా మిషన్ మోడ్‌లో కొనసాగాలని ఆదేశించారు. ఈ లక్ష్యం కోసం అవసరమైన అన్ని వనరులు అందుబాటులో ఉంచుతామని తెలిపారు. గురువారం నిర్వహించిన జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఉన్నతస్థాయి భద్రతా సమీక్ష సమావేశానికి అమిత్ షా అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ తపన్ కుమార్ డేకా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీతో పాటు కేంద్ర సాయుధ బలగాల అధిపతులు పాల్గొన్నారు.
READ MORE: Trump-Greenland: ట్రంప్‌కు డెన్మార్క్ వార్నింగ్.. గ్రీన్‌ల్యాండ్ స్వాధీనం చేసుకుంటే..!
ఆర్టికల్ 370 రద్దు తర్వాత సాధించిన భద్రతా పురోగతిని కాపాడుకోవాలని, అన్ని భద్రతా సంస్థలు సమన్వయంతో అప్రమత్తంగా పనిచేయాలని అమిత్ షా సూచించారు. ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించడమే ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానాన్ని మరోసారి గుర్తుచేస్తూ, కేంద్ర ప్రభుత్వ సమన్వయపూర్వక ప్రయత్నాల వల్ల జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాద వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నదని తెలిపారు. శాశ్వత శాంతి స్థాపన దిశగా భద్రతా బలగాల కృషి ప్రశంసనీయమని అన్నారు.
