Site icon NTV Telugu

Delhi: అద్వానీతో బీజేపీ అగ్రనేతల భేటీ

Adavani Amit Sha

Adavani Amit Sha

బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీని (Lal Krishna Advani) బీజేపీ అగ్రనేతలు కలిశారు. ఇటీవల అద్వానీకి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు అద్వానీకి అభినందనలు తెలిపారు. మంగళవారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah), బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda).. అద్వానీ నివాసానికి వెళ్లి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది.

దేశ వ్యాప్తంగా బీజేపీ బలపడడానికి అద్వానీ విశేష కృషి చేశారని అమిత్ షా గుర్తుచేశారు. భారత రాజకీయాల్లో అనేక మందికి ఆయన ఆదర్శప్రాయుడని కొనియాడారు. ఆయన సేవలు అనేక మందికి స్ఫూర్తిదాయమని పేర్కొన్నారు. అద్వానీకి రాజకీయాల్లోనే కాకుండా ప్రజల్లో కూడా ఆయన పట్ల అపారమైన గౌరవం ఉందనిఅమిత్ షా చెప్పుకొచ్చారు.

అద్వానీ గురించి…
భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడుగా లాల్ కృష్ణ అద్వానీ 1927 జూన్ 8న సింధ్ ప్రాంతంలోని కరాచి పట్టణంలోని సంపన్న కుటుంబంలో జన్మించారు. 15 ఏళ్ల వయస్సులోనే ఆర్ఎస్ఎస్ లో ప్రవేశించారు. దేశ విభిజన సమయంలో భారత దేశానికి వలస వచ్చిన తరువాత దేశ రాజకీయాలకే అంకితమయ్యారు. భారతీయ జనసంఘ్ పార్టీలో చేరిన అనతి కాలంలోనే ముఖ్య పదవులు పొందారు. 1967లో ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ అధ్యక్షుడిగా పని చేశారు. ఆ తర్వాత 1977లో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో మంత్రి పదవి పొందారు. ఇక, 1980లో భారతీయ జనతా పార్టీ ఏర్పడిన తరువాత దేశ రాజకీయాలలో ప్రముఖ పాత్ర వహించే అవకాశం లభించింది.

 

బీజేపీ ఏర్పాటులో అద్వానీ పాత్ర..
ఎమర్జెన్సీ తర్వాత జనసంఘ్ పార్టీ జనతా పార్టీలో విలీనం కావడంతో అద్వానీ 1977లో జనతా పార్టీ తరపున పోటీ చేసి మొరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో సమాచార, ప్రసార శాఖా మంత్రిగా పని చేశారు. జనతా పార్టీ పతనంతో జనసంఘ్ పార్టీ వేరు పడి భారతీయ జనతా పార్టీ పేరుతో కొత్త పార్టీ స్థాపించడంతో అద్వానీకి దేశ రాజకీయాలలో ముఖ్య పాత్ర వహించే అవకాశం దొరికింది. కానీ, బీజేపీ ఏర్పాటు ప్రారంభంలో పార్టీ పరిస్థితి ఏ మాత్రం ఆశాజనకంగా కనిపించలేదు. 1982లో బీజేపీకి కేవలం రెండు స్థానాల్లో మాత్రమే విజయం లభించింది. 1986లో అద్వానీ భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టిన తర్వాత పార్టీ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 1989 లోక్‌సభ ఎన్నికలలో పార్టీ స్థానాల సంఖ్యను 86కు పెంచారు. 1989లోనే అద్వానీ లోక్‌సభలోకి తొలి సారిగా ప్రవేశించారు.

1990వ సంవత్సరంలో ఎల్ కే అద్వానీ రథయాత్ర చేసి దేశంలో సంచలనం సృష్టించారు. 2002లో అటల్ బిహారి వాజపేయి నేతృత్వంలోని ప్రభుత్వంలో ఉప ప్రధాన మంత్రిగా పని చేశారు. అలాగే, 2004లో లోక్‌సభ ప్రతిపక్ష నేతగా పని చేశారు. 2009 ఎన్నికలకు ముందే భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థిగా ఎంపికయ్యారు. కానీ ఆ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రాలేదు. అలాగే 2015లో ఎల్ కే అద్వానీకి కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషన్ అవార్డు ప్రకటించింది.

 

Exit mobile version