Site icon NTV Telugu

Joe Biden: పుతిన్‌పై బైడెన్ దూషణల పర్వం.. బూతు మాటతో స్పీచ్ స్టార్ట్..!

Purin

Purin

అమెరికా (America) అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden) మరోసారి రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై వ్యక్తిగత దూషణల పర్వానికి దిగారు. గతంలో అనేక మార్లు పుతిన్‌పై నోరు పారేసుకున్నారు. తాజాగా మళ్లీ వ్యక్తిగత దూషణలకు దిగారు. మిస్టర్ పుతిన్‌ అని సంభోదించడానికి ఒక బూతు పదాన్ని బైడెన్ ఉపయోగించారు.

పుతిన్ వల్ల అణుయుద్ధం వచ్చే అవకాశం ఉందని.. దీంతో మానవాళి మనుగడకు ముప్పు పొంచి ఉందని బైడెన్ వ్యాఖ్యానించారు. శాన్‌ఫ్రాన్సిస్కోలో జరిగిన మీడియా సమావేశంలో అమెరికా అధ్యక్షుడు ఈ వ్యాఖ్యలు చేశారు.

పుతిన్‌ లాంటి వెర్రి వ్యక్తులు అధ్యక్షులుగా ఉన్నంతకాలం అణుయద్ధం గురించి ఆందోళన చెందాల్సిందేనని బైడెన్ వాపోయారు. అలాంటి వ్యక్తులతో మానవాళి మనుగడకు ప్రమాదకరమేనని చెప్పుకొచ్చారు. ఇక శుక్రవారం నుంచి రష్యాపై కొత్త ఆంక్షలు విధిస్తామని బైడెన్‌ చెప్పుకొచ్చారు.

ఇక పనిలో పనిగా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump)పై కూడా విమర్శలు గుప్పించారు. రష్యా ప్రతిపక్ష నాయకుడు నావల్నీ మృతికి.. తాను ఎదుర్కొంటున్న న్యాయపరమైన సమస్యలకు ముడిపెడుతూ ట్రంప్‌ మాట్లాడటాన్ని బైడెన్‌ తప్పుబట్టారు.

పుతిన్‌పై బైడెన్‌ విమర్శలు చేయడం ఇదే తొలిసారి కాదు. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య ప్రారంభమైన నాటినుంచి పుతిన్‌ విధానాలపై బైడెన్‌ తీవ్ర విమర్శలు చేస్తునే ఉన్నారు. పలు సందర్భాల్లో ఆయనను కసాయి, యుద్ధ నేరస్థుడిగా వ్యాఖ్యానించారు. ఇటీవల అనుమానాస్పద రీతిలో జైల్లో మృతి చెందిన రష్యా ప్రతిపక్ష నాయకుడు నావల్నీ మృతికి పుతినే కారణమని బైడెన్ ఆరోపించారు.

Exit mobile version