NTV Telugu Site icon

RCB Title: అందుకే ఆర్‌సీబీ ఇంకా టైటిల్ గెలవలేదు: అంబటి రాయుడు

Ambati Rayudu Retirement Tweet

Ambati Rayudu Retirement Tweet

Ambati Rayudu on RCB Title: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభమైనప్పటి నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ప్రాంచైజీ ఆడుతున్నా.. ఇప్పటివరకు ఒక్క టైటిల్ కూడా సాధించలేదు. విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్, గ్లెన్ మాక్స్‌వెల్, డానియెల్ వెటోరి.. లాంటి అంతర్జాతీయ స్టార్లు జట్టులో ఉన్నా ఆర్‌సీబీ కప్ గెలవలేకపోయింది. అయితే ఆర్‌సీబీ ఇంకా టైటిల్ గెలవలేకపోవడానికి కారణం ఈ స్టార్ క్రికెటర్లే అని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు పేర్కొన్నాడు. భారీ మొత్తాలు తీసుకుంటున్న అంతర్జాతీయ క్రికెటర్లు ఒత్తిడికి లోనవుతుండటమే ఆర్‌సీబీ టైటిల్ కరవుకు కారణమని తెలిపాడు.

స్టార్ స్పోర్ట్స్ షో ‘క్రికెట్ లైవ్’లో అంబటి రాయుడు మాట్లాడుతూ… ‘రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు ఎప్పుడూ కూడా ఎక్కువ పరుగులు ఇస్తారు. ఇక బ్యాటింగ్‌ విభాగం సరైన ప్రదర్శన చేయదు. ఒత్తిడి సమయాల్లో బ్యాటింగ్‌ చేస్తున్న వాళ్లంతా భారత యువ బ్యాటర్లే. ఇటీవల దినేష్ కార్తీక్ ఆ భారం మోస్తున్నాడు. ఒత్తిడిని ఎదుర్కోవాల్సిన అంతర్జాతీయ స్టార్ ఆటగాళ్లు ఎక్కడ?. క్లిష్ట పరిస్థితులలో అందరూ డ్రెస్సింగ్ రూమ్‌లో ఉంటారు. 16 ఏళ్లుగా ఇదే జరుగుతోంది’ అని అన్నాడు.

Also Read: Shreyas Iyer: 272 స్కోర్ చేస్తామని అస్సలు అనుకోలేదు.. ఏమాత్రం బాధ లేదు: శ్రేయస్‌ అయ్యర్

‘తీవ్ర ఒత్తిడి ఉన్నప్పుడు స్టార్ ఆటగాళ్లు ఎప్పుడూ క్రీజులో నిలబడరు. యువ ఆటగాళ్లంతా బ్యాటింగ్‌ ఆర్డర్‌లో దిగువన వస్తున్నారు. స్టార్‌ బ్యాటర్లంతా టాప్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేస్తున్నారు. కఠిన సమయాల్లో క్రీజులో సీనియర్లు ఎవరూ ఉండరు. ఇలాంటి జట్టు ఎప్పటికీ టైటిల్ గెలవదు. ఐపీఎల్‌లో బెంగళూరు టైటిల్ విజేతగా నిలవకపోవడానికి కారణం ఇదే’ అని అంబటి రాయుడు వివరించాడు. ముంబై ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున రాయుడు ఐపీఎల్‌ టైటిళ్లు సాధించిన సంగతి తెలిసిందే.