Aman Rao Perala Breaks Vaibhav Suryavansh Record: యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. కేవలం 15 ఏళ్లకే క్రికెట్ లో ఎన్నో రికార్డ్ లను తనపేరుతో స్వర్ణ అక్షరాలతో లిఖించుకున్నాడు. అయితే క్రికెట్ అభిమానుల మదిలో వైభవ్ పేరు మారుమోగుతుండగానే.. మరో ఆటగాడు అద్భుత ఇన్నింగ్స్‌తో వార్తల్లో నిలిచాడు. హైదరాబాద్‌కు చెందిన బ్యాటర్ అమన్ రావు పెరాలా తెలంగాణ టీ20 (TG T20) లీగ్ 2026లో కేవలం 32 బంతుల్లోనే సెంచరీ కొట్టి సరికొత్త రికార్డు సృష్టించాడు.
జూన్ 22న జరిగిన తెలంగాణ టీ20 లీగ్ మ్యాచ్‌లో వరంగల్ వారియర్స్ తరఫున బరిలోకి దిగిన అమన్ రావు.. మెదక్ ఫాల్కన్స్ బౌలర్లపై దండయాత్ర చేశాడు. ఓపెనర్‌గా వచ్చిన అతడు 48 బంతుల్లో 295.83 స్ట్రైక్‌రేట్ తో 142 పరుగులు చేసి ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఇన్నింగ్స్ ప్రారంభం నుంచే దూకుడుగా ఆడిన అమన్ కేవలం 32 బంతుల్లోనే శతకం పూర్తి చేశాడు. ఈ ఇన్నింగ్స్‌తో భారత దేశీయ టీ20 లీగ్‌ల చరిత్రలో అత్యంత వేగంగా సెంచరీ చేసిన బ్యాటర్‌గా అమన్ రావు రికార్డు సృష్టించాడు. ఈ దెబ్బతో గతంలో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్‌పై 35 బంతుల్లో శతకం సాధించి నెలకొల్పిన రికార్డును అమన్ అధిగమించాడు.
అమన్ ఇన్నింగ్స్‌లో చెప్పుకోవాల్సింది సయ్యద్ ఘాజీ అబ్బాస్ వేసిన ఒక ఓవర్‌లో 32 పరుగులు సంపాదించడం. అమన్ రావు విధ్వంసకర బ్యాటింగ్‌కు వరంగల్ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 258/7 భారీ స్కోరు నమోదు చేసింది. అయితే ఛేదనలో మెదక్ ఫాల్కన్స్ కెప్టెన్ తిలక్ వర్మ కూడా వీరోచిత పోరాటం చేశాడు. 56 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్సర్లతో 136 పరుగులు చేసి జట్టును విజయానికి చేరువ చేశాడు. 16 ఓవర్లు ముగిసేసరికి మెదక్ స్కోరు 205/6కి చేరుకోగా.. మెదక్ విజయానికి చివరి 24 బంతుల్లో ఇంకా 54 పరుగులు అవసరం అయ్యాయి. అయితే చివర్లో తిలక్ వర్మ విజృంభించడంతో మెదక్ కు విజయాన్ని అందించాడు. ఇంకా రెండు బంతులు మిగిలి ఉండగానే మెదక్ ఫాల్కన్ జట్టు 7 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసి విజయం అందుకుంది.
ఇకపోతే అమన్ రావు ప్రతిభను గుర్తించిన రాజస్థాన్ రాయల్స్, ఐపీఎల్ 2026 వేలంలో రూ.30 లక్షలకు అతడిని జట్టులోకి తీసుకుంది. అయితే సీజన్‌లో ఐపీఎల్ అరంగేట్రం చేసే అవకాశం రాకపోయినా.. ప్రస్తుత ప్రదర్శనలు ఫ్రాంచైజీ నమ్మకాన్ని మరింత బలపరుస్తున్నాయి. ఈ రికార్డు ఇన్నింగ్స్‌పై రాజస్థాన్ రాయల్స్ కూడా సోషల్ మీడియాలో ప్రత్యేకంగా అభినందనలు తెలిపింది.
22 ఏళ్ల అమన్ రావు హైదరాబాద్ తరఫున దేశీయ క్రికెట్ ఆడుతున్నాడు. ఇప్పటివరకు 2 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు, 4 లిస్ట్-ఏ మ్యాచ్‌లు, 11 టీ20 మ్యాచ్‌లు ఆడిన అతడు అన్ని ఫార్మాట్లలోనూ ఆకట్టుకునే ప్రదర్శనలు చేశాడు. తాజాగా సాధించిన ఈ రికార్డు ఇన్నింగ్స్‌తో భవిష్యత్తులో ఐపీఎల్‌తో పాటు జాతీయ జట్టులో చోటు కోసం దోహదపడనుంది.

