మహిళల వన్డే ప్రపంచకప్ 2025 ఆసాంతం బాగా ఆడి.. కీలక సెమీఫైనల్లో ఓడి టోర్నీ నుంచి తప్పుకోవడం చాలా బాధగా ఉందని ఆస్ట్రేలియా కెప్టెన్ అలీసా హీలీ తెలిపింది. బహుశా ఇంతలా బాధపడడం ఇదే మొదటిసారి అనుకుంటున్నా అని చెప్పింది. బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్‌లో సమష్టిగా విఫలమవడమే తమ ఓటమికి కారణం అని స్పష్టం చేసింది. 2029లో జరిగే వన్డే వరల్డ్‌కప్‌లో తాను ఆడనని, అప్పటి జట్టు కొత్తగా ఉంటుందని హీలీ చెప్పుకొచ్చింది. గురువారం భారత్‌పై 338 పరుగులు చేసినప్పటికీ.. ఆస్ట్రేలియా సెమీఫైనల్‌లో ఓడిపోయి టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది.
మ్యాచ్ అనంతరం అలీసా హీలీ మాట్లాడుతూ… ‘ఇది అద్భుత మ్యాచ్. చేతులారా మ్యాచ్ చేజార్చుకున్నాం. టోర్నీ నుంచి తప్పుకోవడం చాలా బాధగా ఉంది. బహుశా మేము ఇంతలా బాధపడడం ఇదే మొదటిసారి. బ్యాటింగ్‌ను సరిగా ముగించలేదు. గొప్పగా బౌలింగ్ చేయకపోవడమే కాకుండా.. ఫీల్డ్‌లో వచ్చిన అవకాశాలను వదిలేశాం. 339 పరుగుల లక్ష్యం సరిపోతుందనుకున్నాం. ఇప్పటికే మేం సగం మ్యాచ్ గెలిచాం అని భావించాము. బంతితో రాణిస్తే విజయం దక్కుతుందనుకున్నాం. కానీ ఫలితం మరోలా వచ్చింది. భారత జట్టు అద్భుతంగా ఆడి విజయం సాధించింది. ఏ విజయానికి వారు అర్హులు’ అని చెప్పింది.
Also Read: Gold Price Today: పసిడి ధరల్లో ఊహించని మార్పు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
‘లిచ్‌ఫీల్డ్ అద్భుతంగా ఆడింది. సెమీఫైనల్‌లో సెంచరీ చేయడం మాములు విషయం కాదు. వచ్చే వన్డే వరల్డ్‌కప్‌లో ఆమె ఆటను చూసేందుకు ఆసక్తిగా ఉన్నా. అప్పటికి జట్టులో చాలా మార్పులు జరగవచ్చు. 2029 వన్డే వరల్డ్‌కప్‌లో నేను ఆడకపోవచ్చు. అప్పటి జట్టు పూర్తిగా మారుతుంది. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ ఉంది. ఆ టోర్నీ కోసం ఎదురుచూస్తున్నాం. గార్డ్‌నర్ మంచి ప్రదర్శన చేసింది. జట్టులో ప్రతీ ఒక్కరు రాణించారు. తప్పిదాల నుంచి మేము పాఠాలు నేర్చుకుంటాం. ఆస్ట్రేలియా మరింత బలంగా తిరిగి వస్తుంది. మాకు అండగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు’ అని అలీసా హీలీ పేర్కొంది. భారత్‌ను విజయపథంలో నడిపించిన జెమిమా రోడ్రిగ్స్ క్యాచ్‌ను హీలీ జారవిడిచింది.
