Site icon NTV Telugu

Alyssa Healy Retirement: షాకింగ్.. ఆస్ట్రేలియా కెప్టెన్ అలీసా హీలీ రిటైర్మెంట్!

Alyssa Healy Retirement

Alyssa Healy Retirement

Australia Women’s Captain Alyssa Healy Retirement: ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టుకు భారీ షాక్. కెప్టెన్ అలీసా హీలీ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది. భారత్‌తో జరగనున్న సిరీస్ తన కెరీర్‌లో చివరిదని వెల్లడించింది. 16 ఏళ్ల పాటు సాగిన గొప్ప క్రికెట్ ప్రయాణానికి ఇదే సరైన ముగింపు అని హీలీ స్పష్టం చేసింది. కొద్ది నెలలుగా తన రిటైర్మెంట్‌పై ఆలోచిస్తున్నానని చెప్పింది. ఎన్నో ఏళ్లుగా అత్యున్నత స్థాయిలో ఆడానని, ఇప్పుడు తనలోని పోటీతత్వం కాస్త తగ్గినట్టు అనిపించిందని హీలీ నిజాయితీగా వెల్లడించింది. మంగళవారం ‘విల్లో టాక్’ పోడ్కాస్ట్‌లో 35 ఏళ్ల హీలీ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించింది.

‘భారత్‌తో జరిగే సిరీస్ నా కెరీర్‌లో చివరిదని చెపుతున్నందుకు చాలా భావోద్వేగంగా ఉంది. ఆస్ట్రేలియా తరపున ఆడాలనే తపన నాలో ఇంకా ఉంది. కానీ కెరీర్ ఆరంభం నుంచి నన్ను ముందుకు నడిపించిన దూకుడు, పోటీ తత్వం ఇప్పుడు కాస్త తగ్గింది. అందుకే రిటైర్మెంట్ ఇవ్వడానికి ఇదే సరైన సమయం అనిపించింది. రిటైర్మెంట్‌పై చాలా ఆలోచించా. గత కొన్ని సంవత్సరాలు శారీరకంగా, మానసికంగా అలసిపోయా. గాయాలు కూడా ఇబ్బంది పెట్టాయి. ఇంతకు ముందు లాగ ఆ శక్తిని తిరిగి తెచ్చుకోవడం ఇప్పుడు కష్టంగా మారింది’ అని అలీసా హీలీ చెప్పింది. హీలీ తన కెరీర్‌ను దాదాపు 300 అంతర్జాతీయ మ్యాచ్‌లతో ముగించనుంది. అన్ని ఫార్మాట్లలో కలిపి 7,000కుపైగా పరుగులు చేసింది.

వికెట్‌ కీపర్‌గా 2010లో టీనేజర్‌గా అలీసా హీలీ ఆసీస్ తరఫున అరంగేట్రం చేసింది. మెగ్ లానింగ్ నాయకత్వంలో చాలా కాలం వైస్ కెప్టెన్‌గా ఉన్న హీలీ.. 2023లో పూర్తి స్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టింది. కెప్టెన్‌గా ఆమె సాధించిన ఘనతల్లో ఇంగ్లాండ్‌పై 16-0తో చారిత్రక వైట్‌వాష్ ఒకటి. తన కెరీర్ మొత్తం మీద హీలీ 8 ఐసీసీ వరల్డ్‌కప్ విజేత జట్లలో సభ్యురాలిగా నిలిచింది. వరల్డ్‌కప్ ఫైనల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు, మహిళల టీ20 అంతర్జాతీయాల్లో వికెట్‌కీపర్‌గా అత్యధిక డిస్మిసల్స్ వంటి అరుదైన రికార్డులు ఆమె ఖాతాలో ఉన్నాయి. 2019లో ప్రతిష్టాత్మక బెలిండా క్లార్క్ అవార్డు అందుకుంది. రెండు సార్లు ఐసీసీ మహిళల టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికైంది. 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో ఆస్ట్రేలియా స్వర్ణ పతకం సాధించడంలో కీలక పాత్ర పోషించింది.

Also Read: Ayush Badoni-Team India: సుందర్‌ స్థానంలో ఆయుష్‌ బదోని.. ఇదే తొలిసారి!

భారత్‌తో జరగనున్న ఏకైక టెస్ట్ అనంతరం అలీసా హీలీ వీడ్కోలు పలుకుతుంది. ఈ మ్యాచ్ మార్చి 6-9 మధ్య పెర్త్‌లో జరుగనుంది. సొంత అభిమానుల మధ్య ఘనంగా వీడ్కోలు పలకాలని హీలీ చూస్తోంది. ఆసక్తికరంగా హీలీ రిటైర్మెంట్ ప్రకటనకు కొద్ది నెలల ముందే డబ్ల్యూపీఎల్ 2026 వేలంలో ఆమెకు షాక్ ఎదురైంది. వేలంలో తొలి పేరుగా వచ్చినప్పటికీ ఏ ఫ్రాంచైజీ కూడా బిడ్ వేయలేదు. యాక్సిలరేటెడ్ రౌండ్‌లో అవకాశం రాలేడు. డబ్ల్యూపీఎల్ తొలి రెండు సీజన్లలో యూపీ వారియర్జ్ తరపున ఆడిన హీలీ.. గాయం కారణంగా 2025 సీజన్‌కు దూరమైంది. 15 సంవత్సరాల పాటు ఆస్ట్రేలియా మహిళల క్రికెట్‌కు వెన్నెముకలా నిలిచిన హీలీ.. అత్యంత ప్రభావవంతమైన వికెట్‌కీపర్-బ్యాటర్లలో ఒకరిగా చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించనుంది.

Exit mobile version