Raaka Update: ‘పుష్ప 2’ వంటి సంచలన విజయం తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘రాకా’ చిత్రంలో నటిస్తున్నారు. దాదాపు ఏడాదిన్నరగా ఈ భారీ ప్రాజెక్ట్ షూటింగ్లో నిమగ్నమైన బన్నీ, ఎక్కువ భాగం చిత్రీకరణ ముంబైలోనే జరుగుతుండటంతో హైదరాబాద్, ముంబై నగరాల మధ్య నిరంతరం రాకపోకలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఎయిర్‌పోర్టుల్లోనే ఎక్కువగా దర్శనమిస్తుండటంతో, ఈ షఫ్లింగ్ ప్రయాణాల నుంచి హీరోకు ఎప్పుడు విముక్తి లభిస్తుందనే ఆసక్తి అభిమానుల్లో మొదలైంది.
ప్రస్తుతం ముంబైలో జరుగుతున్న షూటింగ్ షెడ్యూల్ చివరి దశకు చేరుకుంది. ఈ షెడ్యూల్ ముగియగానే చిత్ర యూనిట్ మొత్తం హైదరాబాద్‌కు షిఫ్ట్ కానుంది. రామోజీ ఫిల్మ్ సిటీ (RFC) లో కీలకమైన భారీ యాక్షన్ ఎపిసోడ్లను చిత్రీకరించేందుకు టీమ్ సన్నాహాలు చేస్తోంది. వాస్తవానికి ఈ యాక్షన్ పార్ట్‌ను దుబాయ్‌లో ప్లాన్ చేసినప్పటికీ, అక్కడ నెలకొన్న తీవ్రమైన ఎండల కారణంగా షూటింగ్‌ను హైదరాబాద్‌కు మార్చినట్లు సమాచారం. ఈ హైదరాబాద్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత మిగిలిన ప్రధాన సన్నివేశాలను విదేశాల్లో తెరకెక్కించనున్నారు.
దర్శకుడు అట్లీ ‘రాకా’ను హాలీవుడ్ స్థాయి విజువల్స్, సాంకేతిక విలువలతో తెరకెక్కిస్తున్నారు. అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌పై ఉన్న నమ్మకంతో ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ సుమారు రూ.1000 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇందులో బన్నీ ద్విపాత్రాభినయం (డ్యూయల్ రోల్) చేస్తున్నారనే వార్తలు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఈ ప్రాజెక్ట్ షూటింగ్ దాదాపు 40-50% పూర్తయినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది వేసవి నాటికి మొత్తం షూటింగ్‌ను పూర్తి చేసి, అదే ఏడాది చివర్లో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్రణాళికలు రచిస్తున్నారు. ఇతర భారీ చిత్రాలు విడుదల తేదీలను ముందే ప్రకటించి ఆపై వాయిదాలు వేస్తున్న తరుణంలో, ‘రాకా’ టీమ్ మాత్రం ఎలాంటి తేదీని అధికారికంగా ప్రకటించకుండా సేఫ్ జోన్లో ఉంటోంది. పూర్తి స్థాయిలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగిసిన తర్వాతే పక్కా విడుదల తేదీని ప్రకటించనున్నట్లు సమాచారం.

