Site icon NTV Telugu

Alibaba Group Splitting: అలీబాబా.. అర డజను ముక్కలు. వ్యూహం మార్చిన జాక్‌ మా వ్యాపార సామ్రాజ్యం

Alibaba Group Splitting

Alibaba Group Splitting

Alibaba Group Splitting: చైనాలోని ఇ-కామర్స్‌ దిగ్గజ సంస్థ అలీబాబా గ్రూప్‌ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం పాల్పడుతున్న సాధింపు చర్యలకు విరుగుడుగా సరికొత్త వ్యూహాన్ని అమలుచేసింది. బిజినెస్‌ యాక్టివిటీస్‌ మొత్తాన్ని అర డజను ముక్కలుగా విభజించాలని నిర్ణయించింది. ఒక కంపెనీని ఆరు ఎంటిటీలుగా మార్చటం ద్వారా విలువ పెంచాలని భావిస్తోంది.

అలీబాబా గ్రూప్‌ ప్రకటించిన ఈ ప్రణాళిక.. మార్కెట్‌లను అమితాశ్చర్యానికి గురిచేసింది. కొత్తగా ఏర్పడే సంస్థలు విడివిడిగా పబ్లిక్‌ ఆఫరింగ్‌కి వస్తాయని తెలిపింది. తద్వారా నిధుల సమీకరణ చేయనున్నాయని పేర్కొనటంతో ఇన్వెస్టర్లు హర్షం వ్యక్తం చేశారు. అలీబాబా గ్రూప్‌ ఆశించిన ఫలితం రానే వచ్చింది. తాజా ప్రకటనతో కంపెనీ షేర్ల విలువ ఒక్కసారే 16 శాతానికి పైగా పెరిగింది.

read more: Writeoff Loans: రుణాలను రైటాఫ్‌ చేస్తే చెల్లించాల్సిన పనిలేదా? నిర్మలాసీతారామన్‌ ఏమంటున్నారంటే..

మార్కెట్‌ క్యాప్‌ సుమారు 30 మిలియన్‌ డాలర్లు వృద్ధి చెందింది. ఈ నేపథ్యంలో.. అలీబాబా వ్యాపార సామ్రాజ్యం చైనా ప్రభుత్వ అణచివేత నుంచి ఉపశమనం పొందనుందని పరిశీలకులు చెబుతున్నారు. జాక్‌ మా ఆధ్వర్యంలో ఆవిర్భవించిన ఈ సంస్థ.. కామర్స్‌, క్లౌడ్‌, లాజిస్టిక్స్‌, కన్జ్యూమర్‌ సర్వీసెస్‌, డిజిటల్‌ మీడియా, ఇన్నోవేషన్‌ తదితర రంగాల్లో వ్యాపారం చేస్తోంది.

ఇప్పటివరకు ఇవన్నీ ఒకే వేదికగా కార్యకలాపాలను నిర్వహించేవి. ముందు.. ముందు.. వేర్వేరుగా వ్యవహరించనున్నాయి. అలీబాబా కంపెనీ విలువ 220 బిలియన్‌ డాలర్లు కావటం విశేషం. ఈ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 200 దేశాల్లో కోటి మంది యాక్టివ్‌ కస్టమర్లు ఉన్నారు. గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 190 దేశాలకు చెందిన 4 కోట్ల మందికి పైగా కొనుగోలుదారులు వ్యాపార అవకాశాలను లేదా లావాదేవీలను పూర్తిచేశారు.

ఈ మేరకు అలీబాబా డాట్‌ కామ్‌ అనే వెబ్‌సైట్‌ ద్వారా ట్రాన్సాక్షన్లు నిర్వహించారు. అలీబాబా అన్ని వ్యాపారాల్లోకెల్లా ఇ-కామర్స్‌కి అతిపెద్ద మార్కెట్‌ ఉంది. దీని విలువ 102 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. దాదాపు రెండేళ్ల కిందట చైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయటంతో అలీబాబా గ్రూప్‌ ఫౌండర్‌ ‘జాక్‌ మా’కి బ్యాడ్‌ టైమ్‌ స్టార్ట్‌ అయింది.

కంపెనీకి చెందిన యాంట్‌ కార్పొరేషన్‌ ఐపీఓ సైతం అర్ధంతరంగా ఆగిపోయింది. ఈ క్రమంలో ‘జాక్‌ మా’ ఏకంగా చైనాను వదిలిపెట్టి వెళ్లిపోయారు. ఏడాదిన్నర తర్వాత రీసెంటుగా స్వదేశంలో అడుగుపెట్టారు. ఆయన వచ్చీ రావటంతోనే అలీబాబా గ్రూప్‌ బిజినెస్‌ స్ట్రాటజీ రూటు మారింది. పూర్వ వైభవం దిశగా తిరిగి ప్రయాణం మొదలుపెట్టింది.

Exit mobile version