Education Commission Chairman: విద్యా కమిషన్ చైర్మన్ పదవికి ఆకునూరి మురళి రాజీనామా.. సీఎస్‌కు లేఖ..

Aakunoori Murali

Aakunoori Murali

తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ పదవికి విశ్రాంత ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపించారు. తనకు అప్పగించిన బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేసినందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన లేఖలో స్పష్టం చేశారు.

తెలంగాణ విద్యా కమిషన్ చైర్‌పర్సన్‌గా సేవలందించేందుకు అవకాశం కల్పించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ బలోపేతం, సంస్కరణలపై క్షుణ్ణంగా అధ్యయనం చేసి, సిఫార్సులతో కూడిన సమగ్ర నివేదికను ఇప్పటికే ప్రభుత్వానికి సమర్పించినట్లు మురళి పేర్కొన్నారు.

“మాకు అప్పగించిన పనిని మేము విజయవంతంగా పూర్తి చేశాం. విద్యపై నివేదికను ప్రభుత్వానికి అందించాం. నా బాధ్యత నెరవేరినందున తెలంగాణ విద్యా కమిషన్ చైర్‌పర్సన్ పదవికి రాజీనామా సమర్పిస్తున్నాను” అని ఆకునూరి మురళి తన లేఖలో వివరించారు.

విద్యా రంగంలో కీలక మార్పుల కోసం ఈ కమిషన్ ఎంతో శ్రమించి నివేదికను సిద్ధం చేసింది. తన టాస్క్ పూర్తవడంతోనే ఆయన గౌరవప్రదంగా పదవి నుంచి తప్పుకున్నారు. విద్యా కమిషన్ చైర్మన్‌గా ఆకునూరి మురళి రాజీనామా చేయడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.