2027 వన్డే ప్రపంచ కప్ కోసం మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా భారత్ తరఫున టాప్-6 ఆటగాళ్లను ఎంపిక చేశారు. సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్త ఆతిథ్యంలో జరగనున్న ఈ టోర్నమెంట్‌పై ఇప్పుడే చర్చలు మొదలయ్యాయి. 2023 ప్రపంచ కప్ ఫైనల్ ఓటమి బాధను తుడిచిపెట్టేందుకు భారత్ సిద్ధమవుతోంది. ఆకాశ్ చోప్రా విశ్లేషణ ప్రకారం 2023లో ఆడిన ఆటగాళ్లే 2027లో కూడా టాప్-6 స్థానాల్లో కొనసాగే అవకాశం ఉంది.
రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఓపెనర్లుగా ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తారని, వీరిద్దరి ఫామ్ అద్భుతంగా ఉందని ఆకాశ్ తెలిపారు. విరాట్ కోహ్లీ తన మూడో స్థానంలో అదే జోరును కొనసాగిస్తారని ఆయన పేర్కొన్నారు. నాల్గవ స్థానంలో శ్రేయస్ అయ్యర్ అత్యుత్తమ మిడిలార్డర్ బ్యాటర్‌గా నిలుస్తారని, గత ప్రపంచ కప్‌లో ఆయన 500కు పైగా పరుగులు చేశారని గుర్తుచేశారు. ఐదో స్థానంలో కేఎల్ రాహుల్ అత్యంత ఫినిషర్ పాత్ర పోషిస్తారని తెలిపారు.
ఆరవ స్థానంలో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఉంటారని ఆకాశ్ పేర్కొన్నారు. హార్దిక్ ఫిట్‌నెస్ కొద్దిగా సందేహం ఉన్నప్పటికీ, ఆయనకున్న స్కిల్ సెట్‌కు ఎవరూ సాటిలేరని ప్రశంసించారు. ఆయన బ్యాటింగ్ లేదా బౌలింగ్ ద్వారా ఎప్పుడూ జట్టుకు ఉపయోగపడతారని అభిప్రాయపడ్డారు.
బ్యాకప్ బ్యాటర్ , వికెట్ కీపర్ రేసులో ఇషాన్ కిషన్ ముందంజలో ఉన్నాడని ఆకాశ్ తెలిపారు. ఇషాన్ ఓపెనింగ్ చేయగలడని, మిడిలార్డర్‌లో ఆడగలడని, కీపింగ్ బాధ్యతలు కూడా నిర్వర్తించగలడని చెప్పారు. ఆసియా క్రీడల్లో ఆయన రాణించిన తీరును ప్రశంసించారు. యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ కూడా రేసులో ఉన్నప్పటికీ.. కీపర్ కమ్ బ్యాటర్ అవసరాల దృష్ట్యా ఇషాన్ కిషన్ అన్నివిధాలా సరిపోతాడని ఆకాశ్ చోప్రా స్పష్టం చేశారు.

