Site icon NTV Telugu

Maharashtra Elections: ఒవైసీని తక్కువంచనా వేశారా? మహారాష్ట్రలో “AIMIM” హవా మామూలుగా లేదు!

Aimim

Aimim

Maharashtra Elections: మహారాష్ట్ర రాజకీయాల్లో ఈసారి ఓ కొత్త గాలి వీసింది. ఇప్పటివరకు పెద్దగా లెక్కచేయని ఒక పార్టీ, ఇప్పుడు నగరాల్లో గట్టిగా తన ఉనికిని చాటింది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ఏఐఎంఐఎం పార్టీ, గాలిపటం గుర్తుతో పోటీ చేసి 2026 మున్సిపల్ ఎన్నికల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించింది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు తర్వాత.. మహారాష్ట్రలోనూ తమది చిన్న పార్టీ కాదని నిరూపించుకుంది. అసదుద్దీన్ ఒవైసీ నాయకత్వంలో ఈ పార్టీ మొత్తం 125 సీట్లు గెలుచుకుంది. ఔరంగాబాద్, మాలేగావ్, నాందేడ్, నాగ్‌పూర్, ముంబయి లాంటి ప్రధాన నగరాల్లో AIMIM బలంగా నిలిచింది. ఇది కేవలం సీట్లు మాత్రమే కాదు.. రాష్ట్ర రాజకీయాల లెక్కలనే మార్చేసింది. ఇదే పార్టీకి రెండు సంవత్సరాల క్రితం పరిస్థితి పూర్తిగా వేరేలా ఉండేది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఛత్రపతి సంభాజీనగర్ నుంచి ఉన్న ఏకైక ఎంపీ సయ్యద్ ఇమ్తియాజ్ జలీల్ ఓడిపోవడంతో లోక్‌సభలో AIMIM ప్రాతినిధ్యం లేకుండా పోయింది. అదే ఏడాది జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 16 చోట్ల పోటీ చేసి కేవలం మాలేగావ్ సెంట్రల్‌లో ఒక్క సీటే గెలిచింది. అప్పుడు చాలామంది ఇక్కడితో AIMIM కథ ముగిసిందనుకున్నారు.

READ MORE: Indian Woman: పాకిస్తాన్ వెళ్లి, మతం మార్చుకుని పెళ్లి చేసుకుంది.. ఇప్పుడు అనుభవిస్తోంది..

కానీ ఈ మున్సిపల్ ఎన్నికలు ఆ అంచనాలన్నిటినీ తలకిందులు చేశాయి. ఇప్పటివరకు కాంగ్రెస్, ఎన్సీపీ, సమాజ్‌వాదీ పార్టీకి ఓటు వేసే మైనారిటీ ఓటర్లు, ఈసారి పెద్ద సంఖ్యలో AIMIM వైపు వచ్చారు. ఔరంగాబాద్, మాలేగావ్ లాంటి ప్రాంతాల్లో గాలిపటం గుర్తు ఒక గుర్తుగా మారిపోయింది. ఈ విజయానికి ప్రధాన కారణం ఒవైసీ బ్రదర్స్ చేసిన దూకుడు ప్రచారం. జనవరి 3 నుంచి 13 వరకు పది రోజులపాటు అసదుద్దీన్ ఒవైసీ, ఆయన తమ్ముడు అక్బరుద్దీన్ ఒవైసీ మహారాష్ట్ర అంతా తిరిగారు. అనేక సభలు, సమావేశాలు నిర్వహించారు. సమయం ఆదా చేసుకోవడానికి అసదుద్దీన్ ఒవైసీ హెలికాప్టర్‌లో ఒక పట్టణం నుంచి మరో పట్టణానికి వెళ్లారు. ప్రచారంలో ఒవైసీ సున్నితంగా మాట్లాడారు. ప్రజలకు రోజూ ఎదురయ్యే సమస్యలనే టార్గెట్ చేశారు. రోడ్లు, నీటి సమస్యలు, డ్రైనేజీ, శుభ్రత, మున్సిపల్ కార్యాలయాల నిర్లక్ష్యం గురించి లేవనెత్తారు. “మీ గల్లీ సమస్యను మేమే మున్సిపాలిటీలో అడుగుతాం” అని హామీ ఇచ్చారు

Exit mobile version