Aghori Srinivas: రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపిన అఘోరి శ్రీనివాస్, వర్షిణి కేసు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరికి సంబంధించిన కేసులో అఘోరీ శ్రీనివాస్ ను అరెస్టు చేసిన పోలీసులు, ఆ తర్వాత రిమాండ్‌కు తరలించారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా శ్రీనివాస్‌ను అరెస్టు చేసి కంది సబ్ జైలుకు తరలించారు పోలీసులు. అయితే, కంది సబ్ జైలుకు తీసుకువచ్చినప్పుడు అఘోరి శ్రీనివాస్ అరుపులు, కేకలతో హంగామా చేశాడు. వర్షిణిని నా దగ్గరే ఉంచాలి.. అంటూ గట్టిగా అరుస్తూ జైలులో వీరంగం సృష్టించాడు. అఘోరి ప్రవర్తనను చూసి జైలు సిబ్బంది సైతం తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు సమాచారం.
ఇక రిమాండ్ నేపథ్యంలో అఘోరి శ్రీనివాస్‌ను ముందుగా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లిన పోలీసులు, అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్యులు ఆయనను ట్రాన్స్ జెండర్ ఫీమేల్‌గా గుర్తించారు. దాంతో కంది సబ్ జైలు అధికారులు జైలులోకి ప్రవేశానికి నిరాకరించారు. దానితో, పోలీసులు శ్రీనివాస్‌ను మరోసారి వైద్య పరీక్షల కోసం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్య నివేదిక ఆధారంగా ఆయనను ఏ జైలుకు తరలించాలన్న దానిపై అధికారులు త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు. అయితే, చంచల్ గూడ జైలులో ట్రాన్స్ జెండర్లకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బ్లాక్ ఉన్నట్లు సమాచారం. కాకపోతే, వైద్యుల నివేదిక ఆధారంగా ఏ జైలుకు తరలించాలో నిర్ణయం తీసుకోనున్నారు. చూడాలి మరి పోలీసు అధికారులు అఘోరి కేసులో ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోబోతున్నారో.
