50 percent tariff on India: ప్రపంచ వాణిజ్యంలో భారత్‌కు మరో సవాల్ ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే అమెరికా భారతదేశంపై 50 శాతం సుంకాలు విధిస్తుండగా, ఇప్పుడు అదే బాటలో మరో దేశం అడుగులు వేయడానికి సిద్ధమవుతోంది. భారతదేశం మరియు చైనా నుంచి దిగుమతి చేసుకునే వాహనాలపై 50 శాతం సుంకం విధించే అంశాన్ని దక్షిణాఫ్రికా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
వాహన దిగుమతులే కారణం
బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, దక్షిణాఫ్రికా వాణిజ్యం, పరిశ్రమ మరియు పోటీ విభాగం ఈ అంశంపై అంతర్గత సమీక్ష చేపట్టింది. భారత్, చైనా నుంచి భారీగా వాహనాల దిగుమతులు జరుగుతుండటంతో స్థానిక ఆటోమొబైల్ పరిశ్రమ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోందని దక్షిణాఫ్రికా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ రెండు దేశాల నుంచి వచ్చే వాహనాలపై అధిక సుంకాలు విధించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, స్థానిక కంపెనీలను కాపాడుకోవడం, దేశీయ తయారీదారులకు పోటీ నుంచి ఊరట కల్పించడమే ఈ ప్రతిపాదిత చర్య ప్రధాన లక్ష్యమని అధికారులు చెబుతున్నారు. తక్కువ ధరకు భారత్, చైనా నుంచి వస్తున్న వాహనాలు ముఖ్యంగా ఎంట్రీ-లెవల్ సెగ్మెంట్‌లో స్థానిక తయారీదారులకు గట్టి పోటీని ఇస్తున్నాయని విధాన నిర్ణేతలు అభిప్రాయపడుతున్నారు.
దిగుమతుల్లో భారత్, చైనా ఆధిపత్యం
2024 గణాంకాల ప్రకారం, దక్షిణాఫ్రికాకు వాహనాలను సరఫరా చేసే అతిపెద్ద దేశాలుగా భారత్, చైనా నిలిచాయి. మొత్తం వాహన దిగుమతుల్లో భారత్ వాటా 53 శాతం కాగా, చైనా వాటా 22 శాతంగా ఉంది. గత నాలుగేళ్లలో చైనా నుంచి దిగుమతులు 368 శాతం పెరిగితే, భారత్ నుంచి దిగుమతులు 135 శాతం పెరిగినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ఇక, వాహనాలకే కాకుండా, వాటి విడిభాగాల దిగుమతులపై కూడా సుంకాలు విధించే అవకాశాన్ని దక్షిణాఫ్రికా పరిశీలిస్తోంది. ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) నిబంధనలకు అనుగుణంగా ప్రస్తుత సుంకాల జాబితాలో మార్పులు చేయాలనే దిశగా చర్యలు తీసుకుంటోంది.
అమెరికా తర్వాత మరో దెబ్బ?
అమెరికా ఇప్పటికే భారతదేశం నుంచి వెళ్లే ఉత్పత్తులపై 50 శాతం సుంకం విధిస్తోంది. దీని వల్ల అమెరికా మార్కెట్‌లో భారత వస్తువుల ధరలు పెరిగాయి. అయినప్పటికీ, గత డిసెంబర్ త్రైమాసికంలో భారత్ నుంచి అమెరికాకు ఎగుమతులు పెరగడం విశేషం. ఇప్పుడు దక్షిణాఫ్రికా కూడా ఇదే తరహా నిర్ణయం తీసుకుంటే, భారత్‌కు అంతర్జాతీయ వాణిజ్యంలో మరో పరీక్ష ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే, ఈ ప్రతిపాదన ఇంకా సమీక్ష దశలోనే ఉన్నప్పటికీ, అమలులోకి వస్తే భారత్-దక్షిణాఫ్రికా వాణిజ్య సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ విషయంలో భారత ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో, ఎలాంటి దౌత్యపరమైన చర్యలు తీసుకుంటుందో అన్నది ఆసక్తికరంగా మారింది.
