NTV Telugu Site icon

Adulterated Food: అడుగడుగునా కల్తీ ఆహారం.. అధికారులు పట్టించుకోరా?

Food (1)

Food (1)

ఎక్కడ చూసినా కల్తీ ఆహారం.. ధనార్ధనే ధ్యేయంగా కల్తీ ఆహారం అమ్ముతున్నారు కొంతమంది వ్యాపారులు. గుంటూరు జిల్లా కేంద్రంగా నకిలీ ఆహార ప్యాకెట్లు ,తినుబండారాలు,చిన్నచిన్న దుకాణాల్లో విచ్చలవిడిగా అమ్మకాలు సాగిస్తున్నారు… ప్రధానంగా చిన్నపిల్లల చిరుతిండ్లు నకిలీ పేర్లతో, కాలం ముగిసిన ఆహార పదార్థాలను అమ్ముతూ సొమ్ము చేసుకున్న వ్యాపారుల దుర్మార్గానికి వందల సంఖ్యలో పిల్లలు అనారోగ్యం బారిన పడుతున్నారు…. తెలిసి తెలియక కొంటున్న ఆహారం తమ పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని ఆందోళన చెందుతున్నారు తల్లిదండ్రులు… ఇంత జరుగుతున్న దీనిపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తిన చందంగా వ్యవహరించడం అనేక విమర్శలకు తావిస్తోంది….

మీరు చూస్తున్న ఈ ప్యాకెట్లు రకరకాల బ్రాండ్ల పేరుతో చలామణి అవుతున్న కల్తీ ఆహారం అని మీకు తెలుసా? చిన్నచిన్న దుకాణాల దగ్గర నుండి హోల్ సేల్ షాపుల వరకు పెద్ద సంఖ్యలో దర్శనమిచ్చే ఈ అందమైన ప్యాకెట్లు చిన్నారుల్ని కాదు పెద్దవాళ్ళను సైతం ఆకర్షిస్తాయి. వారి ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయి….ప్రయాణాల్లో కాలక్షేపం కోసం తీసుకునే ఇట్లాంటి ఆహారం ,ఆ తర్వాత ఒక వ్యసనంగా మారిపోతుంది…. చిన్నపిల్లలైతే ఈ ప్యాకెట్లను కొనివ్వకపోతే స్కూలుకు వెళ్ళని పరిస్థితి ఏర్పడింది.

పిల్లలకు ఐదో పదో చేతిలో పెడితే వాళ్లే వెళ్లి కొనుక్కుని తెచ్చుకుంటున్న ఆహారం ఆ తర్వాత తమ పిల్లలకు తీవ్ర అనారోగ్య సమస్యలు తెచ్చిపెడుతుందన్న విషయాన్ని గమనించిన తల్లిదండ్రులు ఇప్పుడు లబోదిబోమంటున్నారు…. ఇప్పటికే గ్రామ గ్రామాల్లో సందు చివర్లకు చేరిన ఈ ఆహారం పిల్లలకు ఎక్కడబడితే అక్కడ అందుబాటులోకి రావడంతో యథేచ్ఛగా అమ్మకాలు జరుగుతున్నాయి …..కొన్ని బ్రాండెడ్ ప్యాకేజీ ఆహార పదార్థాలు తినడమే ఆహారానికి ఆరోగ్య సమస్యలు తెచ్చిపెడుతుందని డాక్టర్లు చెబుతుంటే అదే బ్రాండెడ్ కంపెనీల పేరుతో నకిలీ ఆహారాన్ని తయారుచేసి జనం మీదకి వదులుతున్నారు.

Read Also:RC 16: అనౌన్స్‌మెంట్ టైం వచ్చేసిందా?

ముఖ్యంగా పల్నాడు, డెల్టా రెండు ప్రాంతాల్లో విచ్చలవిడిగా ఈ కల్తీ ఆహార పదార్థాలు కొనసాగుతున్నాయి… గుంటూరు ,సత్తెనపల్లి, నరసరావుపేట, గురజాల, మాచర్ల, తెనాలి, రేపల్లె బాపట్ల, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ప్రాంతంలోనూ ఈ నకిలీ ఆహార పదార్థాలు అమ్మకాలు కొనసాగుతున్నాయి ….చిన్నచిన్న షాపుల్లో పెట్టి అందంగా దండలా వేలాడ తీసే ఆహార పదార్థాలు పిల్లలను ఇట్టే ఆకర్షిస్తాయి..ఇలాంటి ఆహార పదార్థాలపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి… లేదంటే జిల్లాలో కోట్ల రూపాయల వ్యాపారం, కల్తీ ఆహార పదార్థాల రూపంలో జరుగుతున్న ఎక్కడా ఏ అధికారి వీటిపై నిఘా పెట్టరు… ఎక్కడ ఎవరినీ అరెస్టు చేయరు…. ఎక్కడో చోట పిల్లలకు అనారోగ్యం వచ్చిందని మీడియాలో హడావుడి జరిగితే ఆ ఒక్క పూట ఆ ఒక్క వ్యాపారిపై చర్యలు తీసుకుందామని చేతులు దులుపుకోవడం తప్ప పూర్తిస్థాయిలో కల్తీ ఆహారాన్ని నియంత్రణించడం లేదు.

మరోవైపు ఇలాంటి కల్తీ ఆహారం తినడం వల్ల దీర్ఘకాలిక సమస్యలు ,అనారోగ్య సమస్యలు పిల్లలను వెంటాడటమే కాదు పెద్దలను సైతం అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి… ముఖ్యంగా జీర్ణకోశ వ్యాధి సమస్యలు పెద్ద ఎత్తున… పిల్లల్ని కాదు పెద్దలను వెంటాడుతున్నాయి… పిల్లల కోసం కొనుక్కొచ్చుకున్న ఆహార పదార్థాలను అప్పుడప్పుడు ఇంట్లో పెద్దలు కూడా తినడం ప్రారంభించడంతో పెద్దలకు కూడా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి.. ఇటీవల సత్తెనపల్లి ప్రాంతంలో ఇదే తరహాలో నకిలీ ఆహార పదార్థాలను,కాలం చెల్లిన ఆహారాన్ని తిని నలుగురు చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

Read Also: Iran: హిజాబ్ ధరించని మహిళకు బ్యాంక్ సేవలు.. చివరకు మేనేజర్ పని ఖతం..

పిల్లలకు రంగురంగుల ఆహార పదార్థాలను తయారుచేసి వాళ్ళను ఆకర్షిస్తున్న నకిలీ ఆహార తయారీ సంస్థలు పిల్లల కోసం రకరకాల బొమ్మలను ప్యాకెట్లపై ముద్రించి వాటిని దర్జాగా అమ్మేస్తున్నారు… ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో పిల్లలు వాటిని తినడం ద్వారా అనేక రకాల అనారోగ్య సమస్యలు గురవుతున్నారు. ముఖ్యంగా ప్యాకెట్స్ ఫుడ్లలో కలిసి కెమికల్స్, ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి వాడే పదార్థాలు పిల్లల ఆరోగ్యాన్ని పూర్తిస్థాయిలో దెబ్బతీస్తాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు…. ప్రస్తుతం జరుగుతున్న వ్యవహారంపై అధికారులు తూతూ మంత్రంగా కొన్నిచోట్ల తనిఖీలు దాడులు అంటూ కాలక్షేపం చేస్తున్నారే గాని తయారీదారులపై నకిలీ ఆహారం తయారు చేస్తున్న వారిపై వాటిని పూర్తిస్థాయిలో మార్కెటింగ్ చేస్తున్న వారిపై సరైన చర్యలు తీసుకోవడం లేదన్న వాదన వినిపిస్తోంది.

(గుంటూరు ప్రతినిధి కృష్ణ నాదెండ్ల సౌజన్యంతో..)