Site icon NTV Telugu

Chandrababu Remand Extended: మళ్లీ రిమాండ్‌ పొడిగించిన కోర్టు.. అప్పటి వరకు జైలులోనే చంద్రబాబు

Cbn

Cbn

Chandrababu Remand Extended: ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్ట్‌ అయిన టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు జ్యుడీషియల్‌ రిమాండ్‌ను మరోసారి పొడిగించింది ఏసీబీ న్యాయస్థానం.. ఈ కేసులో గతంలో విధించిన రిమాండ్‌ ఇవాళ్టితో ముగుస్తోన్న నేపథ్యంలో రాజమండ్రి సెంట్రల్‌ జైలు అధికారులు చంద్రబాబును వర్చువల్‌గా విజయవాడలోని ఏసీబీ కోర్టు జడ్జి ఎదుట హాజరుపరిచారు. అయితే, చంద్రబాబు రిమాండ్‌ను నవంబర్‌ 1వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ఈ సందర్భంగా న్యాయస్థానం పేర్కొంది. మరోవైపు.. జైలులో తన భద్రత విషయంలో అనుమానాలున్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు చంద్రబాబు.. అయితే.. ఏమైనా అనుమానాలుంటే రాత పూర్వకంగా ఇవ్వాలని చంద్రబాబుకు సూచించారు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి.. అదే విధంగా చంద్రబాబు రాసే లేఖను తనకు పంపించాలని రాజమండ్రి సెంట్రల్‌ జైలు అధికారులను ఆదేశించింది ఏసీబీ కోర్టు.. ఇక, హైకోర్టులో స్కిల్‌ కేసు బెయిల్‌ పెండింగ్‌లో ఉందని ఈ సందర్భంగా న్యాయమూర్తి తెలిపారు. అదే విధంగా చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై రిపోర్టులు ఇవ్వడం లేదని ఏసీబీ కోర్టులో మెమో ఫైల్‌ చేసిన నేపథ్యంలో.. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై జడ్జి ఆరా తీశారు. ఆయన మెడికల్‌ రిపోర్టులను ఎప్పటికప్పుడు అందించాలని జైలు అధికారులను ఆదేశించింది ఏసీబీ కోర్టు. మొత్తంగా.. స్కిల్‌ కేసులో చంద్రబాబు రిమాండ్‌ను నవంబర్‌ 1వ తేదీ వరకు పొడిగించింది కోర్టు.

Exit mobile version