NTV Telugu Site icon

AAP Office: ఢిల్లీ ఆప్ కార్యాలయానికి సీల్.. నేతల మండిపాటు

Cize

Cize

దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ప్రధాన కేంద్ర కార్యాలయాన్ని అధికారులు మూసివేశారు. దీనిపై మంత్రులు, ఆ పార్టీ సీనియర్ నాయకులు మండిపడ్డారు. సార్వత్రిక ఎన్నికల వేళ పార్టీ కార్యాలయాన్ని ఎలా మూసివేస్తారంటూ నిలదీశారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని మంత్రులు అతిషి, సౌరభ్ భరద్వాజ్ ట్విట్టర్ వేదికగా తెలిపారు.

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్‌ను నిరసిస్తూ ఆప్ కార్యకర్తలు, శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున హస్తినలో ఆందోళనలకు దిగారు. బీజేపీ కార్యాలయం సమీపంలో కూడా నిరసనలు చేపట్టారు. ఈ సందర్భంగా కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఆప్ నిరసనల మధ్య పోలీస్ అధికారులు అప్రమత్తం అయ్యారు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పార్టీ కార్యాలయాల దగ్గర భద్రత కట్టుదిట్టం చేశారు. బీజేపీ కార్యాలయం దగ్గరలోనే ఆప్ కార్యాలయం ఉంది. ఆందోళనల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా పోలీసులు ఆప్ ప్రధాన కార్యాలయాన్ని పోలీసులు మూసివేశారు. అటువైపు ఎవర్నీ రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. దీనిపై ఆప్ నేతలు మండిపడ్డారు. ఎన్నికల వేళ ఇలా చేయడమేంటి? అని మండిపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతోనే ఆప్ కార్యాలయాన్ని మూసివేశారని ఆరోపించారు. ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అతిషి సహా ఇద్దరు మంత్రులను పార్టీ కార్యాలయానికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారని మంత్రి భరద్వాజ్ చెప్పారు. ఎన్నికల సమయంలో జాతీయ పార్టీ కార్యాలయానికి ఎలా సీలు వేస్తారని ప్రశ్నించారు. అతిషి ఇంటికి వెళ్తున్న వాహనాన్ని కూడా పోలీసులు అడ్డుకున్నారని పేర్కొన్నారు. దీంతో పోలీస్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. నిరసనగా ఆప్ శ్రేణులు రోడ్డుపై బైఠాయించారు.

ఇదిలా ఉంటే కేజ్రీవాల్‌ అరెస్ట్‌పై జర్మనీ విదేశాంగ శాఖ వ్యాఖ్యలపై కేంద్ర ప్రభుత్వం మండిపడింది. అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని సూచించింది. కేజ్రీవాల్‌ విచారణ పారదర్శకంగా జరగాలంటూ జర్మనీ సూచించింది. అయితే ఈ ప్రకటనపై కేంద్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఢిల్లీలోని ఆ దేశ రాయబారికి సమన్లు పంపింది. దీంతో ఈ ఉదయం జర్మనీ ఎంబసీ డిప్యూటీ హెడ్‌ జార్జ్‌ ఎంజ్‌వీలర్‌ కేంద్ర విదేశాంగ శాఖ కార్యాలయానికి వచ్చారు. ఆయన ఎదుట భారత్‌ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఈ విధానం మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమేనని మండిపడింది.

ఇది కూడా చదవండి: Neha Sharma: చిరుత నటి పొలిటికల్ ఎంట్రీ.. లోక్‌సభ ఎన్నికల బరిలో నేహా!

ఢిల్లీ లిక్కర్ కుంభకుణంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం ఆయన్ను కోర్టులో హాజరుపర్చగా.. ఏడు రోజులు ఈడీ కస్టడీకి అనుమతిచ్చింది. ఈ కేసులో కేజ్రీవాల్‌కు తొమ్మిది సార్లు ఈడీ సమన్లు జారీ చేసింది. కానీ ఒక్కసారి కూడా ఆయన విచారణకు హాజరుకాలేదు. తనను అరెస్ట్ చేయకుండా ఈడీ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించినా ప్రయోజనం దక్కలేదు. అరెస్ట్ విషయంలో జోక్యం చేసుకోలేమంటూ న్యాయస్థానం తేల్చి చెప్పడంతో కొన్ని నిమిషాల్లోనే అధికారులు కేజ్రీవాల్ నివాసాని చేరుకుని అరెస్ట్ చేశారు.

ఇది కూడా చదవండి: Rashmi: ఒక్క ఫొటో చాలు… సొల్లు కారుస్తారు, దాంతో నాకు పనేముంది?